నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సేవలు భేష్‌

నిజామాబాద్‌, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రశంసించారు. పేదలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు.

జనరల్‌ ఆసుపత్రిలో రూ.1.95 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైర్‌ సేఫ్టీ సిస్టం పనులకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, మేయర్‌ నీతూకిరణ్‌ లతో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా జొస్‌ ఆలుక్కాస్‌ జ్యూవెల్లరీ సంస్థ రోగుల సేవల కోసం ఆసుపత్రికి వితరణ చేసిన సుమారు రూ.30లక్షల విలువ చేసే బస్సును ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం, రెడ్‌ క్రాస్‌ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధులు, ట్రాన్స్‌ జెండర్‌ లకు వైద్య సేవలు అందించేందుకు సమకూర్చిన సంచార అంబులెన్స్‌ ను, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమ్యులేషన్‌ వర్క్‌ షాప్‌ మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు అంకితభావంతో సేవలందిస్తూ, నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రి రాష్ట్రంలోనే మంచి పేరు పొందిందని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారని అన్నారు.

ఆసుపత్రి అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తూ, తమ వంతు సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దాతలు సమకూర్చిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ రోగులకు మరింత మెరుగైన సేవలందించాలని ఆసుపత్రి సుపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమరాజ్‌ కు సూచించారు. ఆసుపత్రిలోని డయాగ్నొస్టిక్‌ విభాగం అందిస్తున్న అత్యుత్తమ సేవలకు గాను న్యాక్‌ అక్రిడిటేషన్‌ గుర్తింపు లభించడం పట్ల మంత్రి అభినందించారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గా ప్రతిమరాజ్‌ బాధ్యతలు చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు కేక్‌ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శన్‌, డిసిఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, టిఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు బుస్సా ఆంజనేయులు, తోట రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »