కామారెడ్డి, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని, గురువారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్ష సూచన సందర్భంగా వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించినందున కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తం ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్ జితిష్ వి.పాటిల్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ప్రజలు బయటకు వెళ్లవద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దని, విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించినందున పిల్లలు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు.
చెరువులు, ప్రాజెక్టులు నిండు తున్నాయని, ప్రాజెక్ట్ ల నుండి నీరు విడుదల చేస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నుండి నీరు విడుదల చేస్తునందున ప్రాజెక్ట్ లోతట్టు ప్రాంతాల్లోని చిన్నతక్కడ్ పల్లి, తుధ్ గల్ గ్రామాలు తదితర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తముగా ఉండాలని కోరారు. అదేవిధంగానేడు నిజాంసాగర్ ప్రాజెక్ట్ కూడా నిండే అవకాశముందని, కావున ప్రాజెక్ట్ పరిధిలోని దామరంచ, గుండె నెమలి, పుల్కల్, గోజే గావ్, సిర్పూర్ లోతట్టు గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ప్రాణం కంటే విలువైనది ఏది లేదు కాబట్టి ఎవరు కూడా వాగులు పరిసర ప్రాంతాలలోని పొలాలలో పనులకు, చేపల వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎక్కువ నీటి ప్రవాహం ద్వారా కొన్ని రోడ్లపై నీరు నిలిచే ప్రమాదముంటుందని ప్రవహించే నీటిని అప్పటికప్పుడే దాటుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయరాదని, నీటిలో కొట్టుకు పోయే ప్రమాదముంటుందని అన్నారు నిలిచినా నీరు 4,5 గంటలలో మెల్లమెల్లగా తగ్గిపోతుందని అన్నారు. జిల్లాలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, భారీ వర్షాల వళ్ళ విద్యుత్ తీగలు క్రిందకు వచ్చినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే అధికారులకు తెలపాలని కోరారు.
అలాగే ప్రజలు ఎవరు కూడా విద్యుత్ స్తంభాలను తాకరాదని, పశువులను కూడా వెళ్లకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో ఉన్న గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులున్నా తక్షణ వైద్య సేవలకు జిల్లా హెల్ప్ లైన్ 08468-220069 ను సంప్రదించాలని, వైద్యాధికారులు, తహసీల్ధార్లు, మండల పరిషద్ అభివృధి అధికారులు ఎల్లవేళలా అప్రమత్తం ఉన్నారని వారు తక్షణమే స్పందించి అవసరమైన సహాయం అందిస్తారని అన్నారు.
వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న, పురాతన మట్టి గోడలు కూలే ప్రమాదముందని, కాబట్టి అందులో నివాసముంటున్నవారు తక్షణమే వాటిని ఖాళీ చేయాలని, అధికారులు నేడు అదే గ్రామంలో ప్రభుత్వ భవనాలలో పునరావాసం ఏర్పాటు చేస్తున్నారని, ఆ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని, పొలిసు, ఫైర్, రెవిన్యూ, పంచాయత్ రాజ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల తదితర ముఖ్య శాఖా అధికారులు అందరు క్షేత్ర స్థాయిలో అప్రమత్తం ఉన్నారని ప్రజలకు భరోసా ఇచ్చారు.