బాల్కొండ, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గ యువతి యువకుల కోసం ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మార్కెట్ కమిటి ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాట్ బుకింగ్,లెర్నింగ్ లైసెన్స్ అందజేసే ఆర్టీవో ఎక్సటెన్షన్ ఆఫీస్ సెంటర్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లు,స్లాట్ బుకింగ్ సిస్టమ్,లైసెన్స్ జారీ చేసే ప్రక్రియను పరిశీలించారు. అందుకు సంబంధించిన వివరాలు అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా స్లాట్ బుకింగ్ కోసం వచ్చిన యువకులతో మంత్రి ముచ్చటించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ… బాల్కొండ నియోజకవర్గంలో త్వరలో పర్మినెంట్ ఆర్టీవో ఎక్సటెన్షన్ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్మూర్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని నియోజకవర్గంలోని దూర ప్రాంతాల మండలాలు ప్రజలకు అది అసౌకర్యంగా ఉన్నదని అన్నారు. అందుకే బిఆర్‌ఎస్ తరుపున సొంత ఖర్చులతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు.
బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోంచి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కు యువత నుండి విశేష స్పందన వస్తోందని,ఇప్పటికే సుమారు 7వేల మంది యువకులు లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారనీ తెలిపారు. ఆర్మూర్ ఆర్టీవో ఆఫీస్ వెళ్లే ఇబ్బందులు లేకుండా వేల్పూర్ లోనే ఎక్సటెన్షన్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నమన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి ఆర్టీవో ఎక్స్ టెన్షన్ కార్యాలయం కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను అడిగిన మూడు గంటల్లోనే దానికి సంబందించిన ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రవాణా శాఖ మంత్రికి నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
ఆయా గ్రామాల వారీగా స్లాట్ బుకింగ్ షెడ్యూల్
అప్లై చేసుకున్న యువత ఓకే రోజు వచ్చి ఇబ్బందులు పడకుండా ఆయా గ్రామాల బిఆర్‌ఎస్ నాయకుల ద్వారా,సోషల్ మీడియా ద్వారా ఏరోజు ఏ ఏ గ్రామాల యువత రావాలో చెప్తామని దీంతో ఎవరికి అసౌకర్యం లేకుండా ఉంటుందన్నారు. ప్రతి రోజు 400 నుండి 500 వరకు స్లాట్ బుకింగ్ జరిగే అవకాశం ఉన్నందున అదే రోజు వారికి లెర్నింగ్ లైసెన్స్ జారీ చేసే అవకాశం కల్పించాలని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారికి మంత్రి సూచించారు.
దీంతో దూర ప్రాంత గ్రామాల నుండి వచ్చే వారికి మళ్ళీ మళ్ళీ తిరగకుండా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వేల్పూర్ లో ఎక్స్ టెన్షన్ ఆఫీస్ ఏర్పాటుకు రవాణా శాఖ అధికారులు వేగంగా స్పందించారని వారికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లైసెన్స్ లేదని పోలీసు చెకింగ్ లు తప్పించుకోవడానికి గల్లిలల్లో,రోడ్ మీద స్పీడ్ గా వెళ్లి యువత ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఇక నుండి తప్పుతుందని,దర్జాగా జేబులో లైసెన్స్ తో వెళ్ళొచ్చని చమత్కరించారు.
నూతనంగా డ్రైవింగ్ లైసెన్స్ అందుకోబోయే యువతి యువకులకు ఈ సందర్భంగా మంత్రి వేముల శుభాకాంక్షలు తెలిపారు.