ఓటర్ల సౌకర్యార్ధం…

నిజామాబాద్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ జిల్లాలో పలు పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.

శాసనసభా నియోజకవర్గాల వారీగా కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, వేరే ప్రాంతానికి తరలించాల్సిన పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ కేంద్రాల పేర్ల మార్పు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఒకే పోలింగ్‌ స్టేషన్‌ లో విలీనం అయ్యే పోలింగ్‌ కేంద్రాల వివరాలతో కూడిన ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్షుణ్ణంగా చర్చించారు. పురాతన కాలం నాటి, శిథిలావస్థకు చేరిన భవనాలలో కొనసాగుతున్న పోలింగ్‌ కేంద్రాలను వేరేచోటికి మార్చడం, 1400 పైచిలుకు ఓటర్లు కలిగిన పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో కొత్త పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు, అలాగే కొత్తగా ఏర్పడిన కాలనీల పరిధిలో కొత్త పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు, రెండు కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో పోలింగ్‌ స్టేషన్లు ఉన్న ప్రాంతాలను గుర్తిస్తూ కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.

జిల్లాలో మొత్తం 1509 పోలింగ్‌ కేంద్రాలు కొనసాగుతుండగా, కొత్తగా మరో 40 కేంద్రాలను ప్రతిపాదించడం జరుగుతోందని, దీనితో జిల్లాలో మొత్తం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 1549 కి పెరుగుతుందని వివరించారు. కొత్తగా ఏర్పడిన మండలాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలతో పాటు మరికొన్ని పోలింగ్‌ స్టేషన్ల పేర్లలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడినందున ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. ఈ ప్రతిపాదనలను ఆమోదం నిమిత్తం ఆగస్టు 4 వ తేదీ లోపు ఎన్నికల సంఘానికి పంపనున్నామని తెలిపారు. మార్పులు, చేర్పులు జరిగిన పోలింగ్‌ కేంద్రాల గురించి ఓటర్లకు తెలిసేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రస్తావించిన పలు అంశాలపై కలెక్టర్‌ వారికి అవగాహన కల్పిస్తూ, సందేహాలను నివృత్తి చేశారు. ఒక ప్రాంతంలోని ఓటర్లకు స్థానిక పోలింగ్‌ స్టేషన్లో ఓటుహక్కు ఉండేలా చూస్తామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫొటో సిమిలర్‌ ఎంట్రీ విధానం ద్వారా ఓటరు జాబితాలో దాదాపు 99 శాతం వరకు డూప్లికేషన్‌ ఓట్లు తొలగించబడ్డాయని, ఇంకనూ ఎక్కడైనా డూప్లికేషన్‌ ఉన్నట్లు గుర్తిస్తే తమ దృష్టికి తేవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్‌, రాజాగౌడ్‌, నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పవన్‌, సాత్విక్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »