నిజామాబాద్, ఆగష్టు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర ఖాళీల భర్తీ కోసం నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి సూచించారు. సీబీఆర్టీ పరీక్షలను పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల గురించి అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లాలో ఈ నెల 05 నుండి 17 వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలోని అర్సపల్లి వద్ద గల ఏ.వీ ఎంటర్ ప్రైజెస్(నాలెడ్జి పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్), ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.
మూడు షిఫ్టులలో పరీక్షలు జరుగుతాయని, మొదటి షిఫ్టు ఉదయం 8 .30 గంటల నుండి 10 .30 వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 12 . 30 నుండి 02 . 30 వరకు, మూడవ షిఫ్ట్ సాయంత్రం 04 .30 నుండి 06 .30 వరకు ఉంటుందని వివరించారు. నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగానే అభ్యర్థులను లోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్లు మూసివేస్తారని, ఆ తరువాత వచ్చిన అభ్యర్థులు లోనికి అనుమతించబడరని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం గంటన్నర ముందే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు తమవెంట తప్పనిసరిగా ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐ.డీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఫోటో ఆధారిత గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తేవాలని, సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేకూడదని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో తగినంత వెలుతురు, సరిపడా లైటింగ్, తాగునీరు, టాయిలెట్ ఇత్యాది వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎం ను నియమించాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తుతో పాటు మహిళా పోలీసు సిబ్బంది ఉండేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ముఖ్యంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్ ను ఆదేశించారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, నిబంధనలను తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్ యాదిరెడ్డి అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.