కామారెడ్డి, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బి.సి. కుల, చేతి వృత్తుల కుటుంబాలలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్ అన్నారు. బుధవారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి. లోని సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గ బి.సి. లబ్దిదారులకు లక్ష రూపాయల చొప్పున 300 మందికి 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణి చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. మత్స్యకారులకు వంద శాతం రాయితీపై చేప పిల్లల పంపిణి, వాటి విక్రయానికి వాహనాలు అందజేశారని తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి చేపలను మనం దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని అన్నారు.
అదేవిధంగా గొల్ల కురుమలకు గొర్రెల పంపిణి పధకం ద్వారా గొర్రెలను పంపిణి చేయడం ద్వారా అధికంగా గొర్రెలు ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన బి.సి. కుల, చేతి వృత్తిదారులకు ఇలాంటి పూచికత్తు లేకుండా పూర్తిగా ఉచితంగా ఇస్తున్న లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు.
ప్రతి నెల నియోజక వర్గం వారీగా 300 మంది చొప్పున లబ్దిదారులకు ఆర్ధిక సహాయం అందజేస్తామని అన్నారు. త్వరలో మైనారిటీ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నామని తెలిపారు. మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నామన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, దానిలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతు భీమా, ఉచిత్ విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తూ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలద్వారా రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తున్నదని, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం మన రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఆన్ లైన్ ద్వారా బి.సి. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ద్వారా అర్హులైన లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామన్నారు. లబ్ధిదారులు ఉచితంగా డబ్బులు వస్తున్నాయని దుబారా చేసుకోకుండా తాము చేస్తున్న వృత్తి నైపుణ్యానికి సంబంధించి పనిముట్లు కొనుగోలు చేసుకొని యూనిట్లను సమర్థవంతంగా నిర్వహించుకొని ఇతరులకు స్ఫూర్తి దాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. ఇద్దరు, ముగ్గురు కలిసి కూడా పెద్ద యూనిట్ ను నెలకొల్పుకోవచ్చని కలెక్టర్ సూచించారు.
ఇది నిరంతర ప్రక్రియ అని, రానివారు నిరాశకు లోనుకావద్దని, ప్రతి నెల అర్హులైన వారిని ఎంపిక చేసి దశల వారీగా ఆర్ధిక సహాయం అందజేస్తామని అన్నారు. అనంతరం లబ్దిదారులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెక్కులను పంపిణి చేశారు. అంతకుముందు బి.సి. అణగారిన వర్గాల అభ్యున్నతిని అవిరాళకృషి చేసిన జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్, జెడ్ పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు, మునిసిపల్ వైస్ ఛైర్పర్సన్ ఇందు ప్రియ, జిల్లా బి.సి. అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఏం.పి.పి లు, జెడ్పిటిసి సభ్యులు, ఎంపిటిసిలు, సర్పంచులు, మునిసిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.