కామరెడ్డి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తల్లిపాలు అమృతంతో సమానమని బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఐ.డి.ఓ. సి లోని కాన్ఫరెన్స్ హాల్ లో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రసవం అయిన వెంటనే వచ్చే ముర్రుపాలు రోగనిరోధక శక్తిని పెంచి బిడ్డను అనేక వ్యాధులు రాకుండా కాపాడతాయని అన్నారు.
అధికారులు గ్రామ స్థాయిలో బిడ్డ పుట్టిన ఆరు మాసాల వరకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి పాలిచ్చే తల్లులకు, గర్భిణులకు, తల్లిపాల ప్రాముఖ్యత పై ఏ.ఎన్.ఏం.లు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించే విధంగా అధికారులు చూడాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై రూపొందించిన యానిమేటెడ్ చిత్రాలు, వీడియోలు, కరపత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
పిల్లలు ఆరోగ్యవంతులుగా మారడానికి తల్లిపాలు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఒక తల్లి తన బిడ్డకు ఇవ్వగల మొట్టమొదటి కానుక తల్లిపాలు కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి రమ్య, డిఎమ్ అండ్ హెచ్ ఓ లక్ష్మణ్ సింగ్, జిల్లా బిసి అభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, సిడిపిఓలు, అధికారులు పాల్గొన్నారు.