కామారెడ్డి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత నిబంధనలు పాటించవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించి వాహనం నడిపే విధంగా చూడాలన్నారు. హైవే లకు సమీపంలో ఉన్న గ్రామాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారిపై అక్కడక్కడ ఏర్పడిన గుంతలను నేషనల్ హైవే అధికారులు త్వరలో పూడ్చి వేయాలని చెప్పారు. గత ఆరు నెలలుగా జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమీక్ష జరిపారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలను వివరించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లపై కేజీ వీల్స్ నడిపితే ట్రాక్టర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పిట్లం, సదాశివనగర్, బిక్కనూర్ ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు జరిగిన స్థలాలను గుర్తించారు. ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రధాన రోడ్డుపై ఉన్న గుంతలను జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పూడ్చి వేయిస్తామని తెలిపారు. విద్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులకు అవగాహన కల్పించడం వల్ల రోడ్డు ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో వాణి, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, పోలీస్, విద్య, వైద్య, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.