కామారెడ్డి, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. గురువారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి లోని సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, సూపర్వైజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తూ 30 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరు షుగర్, బి.పి చెక్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వాసుపత్రులల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని కోరారు. క్లిష్ట పరిస్థితులలో మాత్రమే (సి సెక్షన్ ) సిజేరియను చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. పి హెచ్.సి వారీగా వివిధ కార్యక్రమాల పనితీరును సమీక్షిస్తూ ప్రసవాలు తక్కువగా చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. వచ్చే సమీక్ష నాటికీ మెరుగుపడాలన్నారు.
ఈ సందర్భంగా టి -హబ్ ల పనితీరును సమీక్షిస్తూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రతి రోజు కనీసం 15 శాంపుల్స్ పంపేలా చూడాలన్నారు. మాతా, శిశు సంరక్షణ, సార్వత్రిక టీకాలు,టిబి, షుగర్ వంటి కార్యక్రమాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్ సింగ్, డిప్యూటీ డి ఏం అండ్ హెచ్ ఓ లు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.