మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, ఆగష్టు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-25 నూతన మద్యం పాలసీకి ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించుటకు శుక్రవారం గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశామని జిల్లా ఆబ్కారీ పర్యవేక్షకులు యస్‌.రవీంద్ర రాజు అన్నారు. గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

జిల్లాలోని కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ఆబ్కారీ స్టేషన్‌ పరిధిలో 49 మద్యం దుకాణాలకు గాను గౌడ కులం, ఎస్సి, ఎస్టీ లకు మద్యం దుకాణాల రిజర్వేషన్‌ కు గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ లక్కీ డ్రా తీశారన్నారు. 14 మద్యం దుకాణాలు రిజర్వేషన్‌ పోగా మిగతా 35 దుకాణాలు జనరల్‌ కు కేటాయించామని అన్నారు. ఇందుకోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు కలెక్టరేట్‌లో స్టేషన్‌ వారీగా 5 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

ఈ నెల 18 న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడునని ఆయన తెలిపారు. దరఖాస్తులు నేరుగా సమర్పించాలని, పోస్టు ద్వారా , మెయిల్‌ ద్వారా స్వీకరించబడవని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా గాని, భాగస్వామ్యంగా గాని, సంస్థ గాని, రాష్ట్రంలోని ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని రవీంద్ర రాజు తెలిపారు. దరఖాస్తు వెంట నాన్‌ రిఫండల్‌ రూ. 2 లక్షల డిమాండ్‌ డ్రాఫ్ట్‌ లేదా చలానా రూపంలో చెల్లించాలని తెలిపారు.

ఆధార్‌, పాన్‌ కార్డు, 3 పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు జతపరచాలని అన్నారు. 21 సంవత్సరాల లోపు వ్యక్తులు అనర్హులని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21 న సిరిసిల్ల రోడ్‌ లోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్‌ హాల్‌ లో జిల్లా కలెక్టర్‌ సమక్షంలో లక్కీ డ్రా తీయబడునని, విజేతలు అదే రోజు లేదా మరుసటి రోజు లైసెన్సు ఫీజు లో ఆరవ వంతు డబ్బులు చెల్లించాలని, లేనిచో డిఫాల్టర్‌ గా మిగిలిపోతారని అన్నారు.

జిల్లాలో 5 వేల జనాభా లోపు 7 దుకాణాలు, 5,001 నుంచి 50 వేల జనాభా లోపు 33 దుకాణాలు, ఒక లక్ష నుంచి 5 లక్షల జనాభా లోపు 9 దుకాణాలున్నాయని అన్నారు. నూతన మద్యం దుకాణదారులకు నవంబర్‌ 30 న స్టాక్‌ ఇవ్వడం జరుగుతుందని, డిసెంబర్‌ 1 నుంచి దుకాణాలను నడుపుకోవచ్చని రవీంద్ర రాజు తెలిపారు.
ప్రెస్‌ మీట్‌లో ఆబ్కారీ సి.ఐ. లు విజయ్‌ కుమార్‌, మధుసూదన్‌, సాజిద్‌ అహ్మద్‌, సుందర్‌ సింగ్‌, ఎస్‌. ఐ. లు విక్రమ్‌ కుమార్‌, అభిషేక్‌, మమత, తేజస్విని పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »