కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీధి కుక్కల జనాభాను తగ్గించడానికి కామారెడ్డి పట్టణంలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను త్వరలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం జంతు హింస నివారణ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
వీధి కుక్కలను చంపుట, వేధించుట, హింసించుట చేయకూడదని చెప్పారు. చనిపోయిన కళేబరాలను మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ అధికారులు తక్షణమే తొలగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. పశువులు, ఇతర జంతువులు, పక్షులు రవాణా చేసినప్పుడు తప్పనిసరిగా జంతు హింస నివారణ నిబంధనలు పాటించాలని సూచించారు. పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
వన్యప్రాణులను కాపాడుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు వీధి కుక్కలతో ఎలా మేలుగాలి, జాగ్రత్తలపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ కే.ఎన్ రెడ్డి, ఆర్టీవో వాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సింహా రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, ఫారెస్ట్ అధికారి రమేష్, జిల్లా సేల్స్ టాక్స్ అధికారి రవికుమార్, సభ్యులు పాల్గొన్నారు.