కామారెడ్డి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అని, 1934లో 33 ఏళ్ల చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టిన ఆయన స్వాతంత్య్ర ఉద్యమం కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టారని, దేశ విభజన సమయంలో బెంగాల్, పంజాబ్ పూర్తిగా పాకిస్తాన్‌కు వెళ్లకుండా అడ్డుపడ్డారని, జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత జాతీయ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా చేరారని, అయితే నెహ్రూ విధానాలను వ్యతిరేకించి ప్రభుత్వం నుండి బయటకు వచ్చి, దేశంలో జాతీయ వాదుల కోసం 1951లో భారతీయ జనసంఫ్‌ు పార్టీని ప్రారంభించారన్నారు.
పార్టీ కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా మారిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుబట్టారని, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్.. నహీ చలేగా, నహీ చలేగా..’ ( ఒక దేశంలో రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు, రెండు పతాకాలు వద్దే వద్దు) అంటూ నినదించారన్నారు. మహనీయుని కలలను నేటి మోదీ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. అనంతరం కార్యాలయం ఎదుట మొక్కలు నాటి నీరుపోశారు.