నిజామాబాద్, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల బాధ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. అన్యాయాన్ని ఎదురిస్తూ, సర్వాయి పాపన్న గౌడ్ చూపిన పోరాట తెగువ అనన్యసామాన్యమైనదని కొనియాడారు. రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కులవృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం జరిగిందన్నారు.
నాటి దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం జయించి, జనరంజకంగా పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమాజంలో అందరూ సమానులేననే భావన పెంపొందేందుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. గీత కార్మికులు సమిష్టిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ హితవు పలికారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బీసీ సంఘాల బాధ్యులు, గౌడ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో గీత వృత్తిదారులు పాల్గొన్నారు.