నిజామాబాద్, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబుల్ బెడ్ రూమ్ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనూ రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అట్టహాసపంగా ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకే సముదాయంలో అన్ని వసతులతో మొత్తం 224 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించగా, తొలివిడతగా 155 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు.
ఇళ్ల నిర్మాణాల నాణ్యత, ఇతర సదుపాయాలను మంత్రి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారుల కోరిక మేరకు సముదాయానికి కేసీఆర్ కాలనీగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్తులు మంత్రికి డప్పు వాయిద్యాలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. సముదాయ ప్రాంగణం నుండి సభా వేదిక వరకు దారి పొడుగునా పూల వర్షం తో మంత్రికి స్వాగతం పలికిన లబ్ధిదారులు వారి కుటుంబీకులు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించడం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రికి రుణపడి ఉంటామని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, డబుల్ లబ్ధి దారుల ఎంపిక ఎంతో నిఖార్సుగా జరిగిందని అన్నారు. మోర్తాడ్ లో డబుల్ నిర్మాణాల కోసం రూ. 15 కోట్లు మంజారు చేయించానని, అందులో రూ. 13.5 కోట్లు ఇళ్ల నిర్మాణాలకు వెచ్చించామని, మిగతా నిధులతో రోడ్ల నిర్మాణాలు జరిపించామని వివరించారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులైన వారిని ఎంపిక చేసేలా అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సైతం జోక్యం చేసుకోకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేందుకు పూర్తి సహకారం అందించారని మంత్రి వారిని అభినందించారు.
ప్రస్తుతం 155 కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేశామని, మిగితా 69 ఇళ్లను రెండవ విడత లో అర్హులకు త్వరలో మంజూరు చేస్తామని అన్నారు. అంతేకాకుండా సొంత జాగా కలిగి ఉన్న మరో 120 మందికి గృహలక్ష్మి పథకం కింద మంజూరీ తెలిపామని వివరించారు. అంటే, అదనంగా మరో 200 మందికి ఇళ్లను అందిస్తున్నామని అన్నారు. మొదటి విడతలో ఇల్లు రాని వారు నిరాశ చెందవద్దని, అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇళ్లను పంపిణీ చేస్తామని భరోసా కల్పించారు.
ఇది నిరంతర ప్రక్రియ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇక్కడితోనే ఆగిపోదని, మలివిడత నిర్మాణాల్లో ప్రస్తుతం అర్హులుగా ఎంపికైన వారికి ఇళ్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పేదవారికే ప్రాధాన్యత ఉంటది తప్ప పైరవీలకు కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎట్టి పరిస్థితులను ఇతరులకు అమ్ముకోవద్దని, పిల్లల భవిష్యత్తు కోసం సొంత ఇంటి అవసరాల కోసం తమ పేరిట అట్టి పెట్టుకోవాలని మంత్రి లబ్ధిదారులకు హితవు పలికారు.
కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పిటిసి రవి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, డీఎల్పీఓ శ్రీనివాస్, సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు.