సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరీలో జాప్యానికి తావులేకుండా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని హితవు పలికారు.

ఆసరా పెన్షన్లు, తెలంగాణకు హరితహారం, బీ.సీలు, మైనార్టీలకు ఆర్ధిక సహాయం, నోటరీ భూముల క్రమబద్దీకరణ, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి, నివేశన స్థలాల అందజేత, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఆసరా పెన్షన్ల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి అర్హుల జాబితాను ఆమోదం నిమిత్తం పంపించాలని సీ.ఎస్‌ సూచించారు. గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఎంపీడీఓ ల వద్ద పెండిరగ్‌ లో ఉన్న దరఖాస్తులను సైతం వెంటనే తెప్పించుకుని, పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆన్లైన్‌ చేయించాలని, నాలుగు రోజుల్లోపు ఆసరా పెన్షన్లకు సంబంధించిన ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండిరగ్‌ లేకుండా త్వరితగతిన పరిశీలనను పూర్తి చేయాలని సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పందిస్తూ, రెండు రోజుల్లో పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని సీ.ఎస్‌ దృష్టికి తెచ్చారు. కాగా, నోటరి భూముల కింద ఇప్పటి వరకు ఆన్‌ లైన్‌ లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటి కప్పుడు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని సీ.ఎస్‌ సూచించారు.

నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా నియామక ఉత్తర్వులను అందించడంలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో గుంతలు తవ్వించి, మొక్కలు, అవసరమైన ఇతర సామాగ్రిని పంపించాలని, స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి అన్ని వర్గాల వారు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీ.ఎస్‌ మార్గనిర్దేశం చేశారు.

దశాబ్ది సంపద వనాల క్రింద మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని, వచ్చే వారం నాటికి ప్రతి జిల్లాలో 90 శాతానికి పైగా మొక్కలు నాటించాలని గడువు విధించారు. ఎతైన మొక్కలు నాటి, ప్రతి మొక్క సంరక్షించబడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీ.ఎస్‌ సూచించగా, ప్రతిరోజూ సగటున కనీసం ఇరవై బృందాలను జీవాల కొనుగోలు కోసం పంపిస్తున్నామని, నిర్ణీత గడువులోపు గొర్రెల పంపిణీ లక్ష్యం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సీ.ఎస్‌ కు తెలిపారు.

కాగా, ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దరిమిలా, అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కంట్రోల్‌ రూమ్‌ లను ఏర్పాటు చేయాలని సీ.ఎస్‌ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బీసీ కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయానికి సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తూ, సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా వెంటదివెంట చెక్కులు పంపిణీ చేయించాలని అన్నారు.

మైనారిటీ బంధు కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గృహలక్ష్మి పథకం క్రింద ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం నిర్దేశించిన నమూనాను అనుసరిస్తూ వేగవంతంగా వెరిఫికేషన్‌ జరిపించాలని సీ.ఎస్‌ సూచించారు. గృహలక్ష్మి పథకం అమలును నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సూపర్వైజరీ అధికారిని నియమించాలని అన్నారు. అలాగే, కారుణ్య నియామకాల ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, న్యాయపరమైనవి, ఇతరత్రా చిక్కులు ఏవైనా ఉంటే, వాటిని పరిష్కరించుకుంటూ కారుణ్య నియామకాలు జరిపేందుకు చొరవ చూపాలన్నారు.

వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, డీ.ఎఫ్‌.ఓ వికాస్‌ మీనా, డీ.ఆర్‌.డీ.ఓ చందర్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »