కామారెడ్డి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దాతల నుంచి విరాళాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టెలీ కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ఈనెల 10న గ్రామ సభలలో సన్మానం చేయాలని సూచించారు. ఈ నెల 9న గ్రామాల్లోని వ్యాపార సంస్థల వద్ద మొక్కలు నాటాలని కోరారు.
వ్యాపారస్తుల సహకారంతో మొక్కలు నాటి వారి కుటుంబ సభ్యుల పేరు మొక్కకు పెట్టాలని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ లోపు గ్రామాల్లోని కంపోస్టు షెడ్లు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు వాడుకలోకి వచ్చే విధంగా చూడాలన్నారు. ఇంటింటికి మొక్కలను పంపిణీ చేయాలని కోరారు. ప్రతిరోజు గ్రామాల్లో శ్రమదానం కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
విద్యుత్ సమస్యలు ఉంటే ట్రాన్స్ కో అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా పంచాయతీ అధికారి సునంద, డిఎల్‌పిఓ సాయిబాబా, ఉపాధి హామీ ఏపీడిలు సాయన్న, శ్రీకాంత్ పాల్గొన్నారు.