మీ ఉజ్వల భవితకు మీరే నిర్దేశకులు

ఆర్మూర్‌, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీ ఉజ్వల భవితకు మీరే మార్గనిర్దేశకులు అని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి విద్యార్థులను ఉద్దేశించి ఉద్బోధించారు. అదృష్టం పై ఆధారపడకుండా ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత అవకాశాలు ఆహ్వానం పలుకుతాయని, అద్భుత విజయాలు వరిస్తాయని అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి యేటా నిర్వహిస్తున్న ఆనవాయితీని పాటిస్తూ ‘విద్యా స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహించారు.

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్‌ పట్టణంలోని నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన ట్రస్టు ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు. బంగారు, వెండి పతకాలను బహూకరించి, చిన్నారులకు ప్రోత్సాహకాలు అందజేశారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఆర్మూర్‌ ఆర్డీఓ వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొని విద్యా స్పూర్తి కార్యక్రమానికి వన్నెలద్దారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి విద్యార్థులను ఉన్నత లక్ష్యాల దిశగా పయనించేలా ప్రభావవంతమైన ప్రసంగంతో అందరిలోనూ స్ఫూర్తిని పెంపొందించారు.

మనం పెరిగే వాతావరణం, ఆలోచనా తీరుపైనే మేధస్సు అనేది ఆధారపడి ఉంటుందని, సానుకూల దృక్పథంతో ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం తథ్యమని సూచించారు. ఇతరులను నిందించడం మానుకుని, మన ఎదుగుదలకు దోహదపడేలా ముందుకు సాగాలని హితవు పలికారు. సమాజానికి సరైన దశా,దిశా చూపే గురుతర బాధ్యత కలిగిన గురువులు విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. బండరాయిని ఓ శిల్పి ఎలాగైతే దేవతామూర్తి విగ్రహంగా చెక్కి పూజలందుకునేలా చేస్తాడో, ఉపాధ్యాయులు కూడా అదే స్ఫూర్తితో పిల్లల్లో సామాజిక స్పృహ, సానుకూల దృక్పధాన్ని పెంపొందిస్తూ, చక్కటి విద్యా బోధన అందించడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడి గురువు స్థానానికి సార్థకత చేకూర్చాలన్నారు.

కౌమార దశ ఎంతో సున్నితమైందని, ఈ వయసులోని పిల్లలను సరైన దిశగా ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఎంతో ప్రాముఖ్యమైనదని, విద్యతోనే సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని, మన విలువను పెంపొందించుకోగల్గుతామని మార్గనిర్దేశం చేశారు. పేద కుటుంబాలకు చెందిన వారు సైతం తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆశిస్తూ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి చదివిస్తున్నారని, విద్యార్థులు వారి ఆశలను వమ్ము చేయకుండా కన్నవారి ఆశయాలను అనునిత్యం స్మరించుకుంటూ అంకితభావంతో చదవాలని సూచించిన సందర్భంగా కమిషనర్‌ పార్థసారథి ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.

అవసరమైతే తమ తల్లిదండ్రుల ఫోటోను ముందర పెట్టుకుని లక్ష్యం దిశగా ముందుకు సాగాలని తెలిపారు. చదువుకు అడ్డంకిగా మారే సెల్‌ ఫోన్‌, సినిమాలు, సీరియళ్లు వంటి వాటికి బానిసలుగా మారకుండా, ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని పక్కా ప్రణాళికతో కృషి చేయాలన్నారు. క్రమశిక్షణను అలవర్చుకుని, ఏ రోజు పాఠాన్ని ఆ రోజే పునఃశ్చరణ చేసుకోవాలని, వాయిదా వేసే జాడ్యాన్ని విడనాడాలని సూచించారు. 142 కోట్లకు చేరుకున్న జనాభాతో భారతదేశం చైనాను దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుందని, యూరప్‌ దేశాలతో పోలిస్తే అత్యధిక యువ శక్తి మన దేశంలోనే ఉందని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తే వారి బంగారు భవితకు, దేశాభ్యున్నతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. నానాటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో కృత్రిమ మేధస్సు సమాజానికి అనేక సవాళ్లు విసురుతోందని, దీనివల్ల రానున్న రోజుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. దుబాయ్‌ వంటి దేశాల్లో ఏకంగా ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ కు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఉటంకించారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు, యువత సైతం తమ సృజనాత్మక శక్తిని పెంపొందించుకుని నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కమిషనర్‌ పార్థసారథి సూచించారు. అలాంటప్పుడే నిర్దిష్ట రంగాల్లో కొత్తగా సృష్టించబడుతున్న ఉద్యోగావకాశాలు అందుకోగల్గుతారని అన్నారు. పేదరికం, మారుమూల ప్రాంతం వంటి కారణాలను మనసులో పెట్టుకుని ఆత్మన్యూనతకు గురికాకూడదని, ప్రతిభ కలిగిన వారికి సమాజం నుండి తప్పక ప్రోత్సాహం లభిస్తుందని విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతును ఆదర్శంగా తీసుకుని చదువులో రాణించాలని పిలుపునిచ్చారు.

విద్యార్జనలో మేటిగా నిలుస్తూ కలెక్టర్‌ రాజీవ్‌ హనుమంతు పిన్న వయస్సులోనే ఐ.ఏ.ఎస్‌ సాధించారని, తన ప్రతిభతో ఇప్పటివరకు ఏకంగా నాలుగు జిల్లాలకు కలెక్టర్‌ గా సేవలందిస్తున్నారని అన్నారు. ఒక ఐ.ఏ.ఎస్‌ అధికారికి నాలుగు జిల్లాలకు కలెక్టర్‌ గా పనిచేసే అవకాశం లభించడం చాలా అరుదు అయినప్పటికీ, ఆయన క్రమశిక్షణ, పరిపాలనా పటిమతో ఈ అవకాశం లభిస్తోందని కమిషనర్‌ అన్నారు. తాను ఎప్పటినుండో కోరుకుంటున్న ఆంగ్లమాధ్యమ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, దీనివల్ల ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థులకు సైతం ఉన్నత అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. అయితే ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాంశాలలో మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని కమిషనర్‌ అభిప్రాయపడ్డారు.

కాగా, తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 2008 నుండి విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడిరచారు. ఇందులో భాగంగా విద్యార్థుల కెరీర్‌ కు, పోటీ పరీక్షలలో విజయానికి దోహదపడే విధంగా నిపుణులైన మల్లికార్జున్‌ చే హ్యాండ్‌ రైటింగ్‌ శిక్షణ ఇప్పిస్తున్నామని, పట్టాభిరామ్‌ చే వ్యక్తిత్వ వికాసం తరగతులు నిర్వహింపజేస్తున్నామని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు అనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ఎదుగుదల చక్కటి నిదర్శనమని అన్నారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ, తాను పుట్టిపెరిగిన ప్రాంతం, చదువుకున్న బడిని మర్చిపోకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రుల పేరిట ట్రస్టును నెలకొల్పి అవార్డులు అందిస్తుండడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఆర్మూర్‌ లోని నాలుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతో అదృష్టవంతులని, వారికి కమిషనర్‌ పార్థసారథి రూపంలో తోడ్పాటు లభిస్తోందని అన్నారు.

దీనిని విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదిగి విద్యాస్ఫూర్తి కార్యక్రమానికి సార్థకత చేకూర్చాలని సూచించారు. ఆర్మూర్‌ లోని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పన కోసం జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామని తెలిపారు. ప్రభుత్వ బడులలో ఆంగ్ల మాధ్యమాన్ని సైతం ప్రవేశపెట్టిన నేపథ్యంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదవ తరగతిలో టాపర్లుగా నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం ఎస్సెస్సీ చదువుతున్న వారు పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎస్సెస్సీలో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్‌ ప్రభుత్వ జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలకు చెందిన శ్రీకృష్ణ, బి.లక్ష్మీ వివేక్‌, బాలికల పాఠశాలకు చెందిన బి.హరివర్ధిని, జి.సాహితీ, రాంమందిర్‌ ఉన్నత పాఠశాలకు చెందిన జె.విఘ్నేష్‌, కె.రోహిత్‌, జనార్దన్‌ రాజశేఖర్‌, సైదాబాద్‌ ఉర్దూ మీడియం జెడ్పిహెచ్‌ ఎస్‌ కు చెందిన షర్యా ఫిర్దోస్‌, రిముషా మాహిన్‌లకు అవార్డులతో సత్కరించి ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో విద్యా శాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌ విజయభాస్కర్‌, ఎంఈఓ రాజ్‌ గంగారాం, ట్రస్టు కన్వీనర్‌ నర్సింలు, పాఠశాల హెచ్‌.ఎం కవిత తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »