ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్‌, ఆగష్టు 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిఉన్న ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం వయోవృద్దులకు పోలింగ్‌ ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల పనితీరు గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తూ, కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వి.వి.ప్యాట్‌ల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని హితవు పలికారు. జిల్లాలో ఎంతో చైతన్యం కలిగిఉన్న వయోవృద్ధులు ఓటింగ్‌ ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు.

ఓటర్ల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేపడుతూ, వివిధ రకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని కలెక్టర్‌ గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ఎనభై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులు, దివ్యంగులు తమ ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించిందని వివరించారు. ఇంటి నుండి ఓటు వేయదల్చుకున్న వారు ఎన్నికల ప్రకటన వెలువడిన మీదట నిర్ణీత ఫారం నింపి తమ అభ్యర్థనను తెలియజేస్తే, పోలింగ్‌ అధికారి నేతృత్వంలోని సిబ్బంది వారి ఇంటి వద్దకు వచ్చి సీక్రెట్‌ బ్యాలెట్‌ విధానాన్ని అనుసరిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

ఈ సదుపాయాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వయోవృద్దుల కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ర్యాంప్‌, వీల్‌ చెయిర్‌ వంటి సదుపాయాలూ అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేస్తూ, పూర్తి అవగాహన కల్పించేందుకు వీలుగా కలెక్టరేట్‌, ఇతర కార్యాలయాల్లో నమూనా కేంద్రాలను నెలకొల్పడం జరిగిందన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పలువురు సీనియర్‌ సిటిజన్‌ లు తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ సిటిజన్స్‌ ను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌, స్వీప్‌ నోడల్‌ అధికారి సింహాచలం, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్‌ బీ, సీనియర్‌ సిటిజన్‌ ఫోరమ్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు భూమన్న, రవీందర్‌, రామ్మోహన్‌, బుస్స ఆంజనేయులు, వయోవృద్దులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »