బాన్సువాడ, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధీభవన్లో మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.
డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల కొరకు ఈ నూతన దరఖాస్తు పద్ధతి చాలా బాగుందని దీనికి ఉత్సాహవంతులైన నిజమైన కార్యకర్తలకు అవకాశం కలిగినట్టు ఉన్నదన్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని అన్నారు. మిగతా పార్టీలలో ఇటువంటి పద్ధతి ఉండదన్నారు. నియోజకవర్గంలో ఒక నాయకుడి కనుసైగల్లో మాత్రమే నడుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీలో కింది కార్యకర్త నుంచి సీఎం అభ్యర్థి వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నారు.
ప్రజలలో కూడా మంచి స్పందన ఉందని కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసి ముందుకు వెళ్తామని అన్నారు. గత 23 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభమై ఏ రోజు కూడా పార్టీ మారకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ వాదిగా ఉన్నానని పీహెచ్డి చేసిన ఉద్యోగం వైపు వెళ్లకుండా ప్రజలకు సేవచేయాలనే రాజకీయాల్లో ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే బాన్సువాడ నియోజకవర్గంలో అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ విజయం వైపు తీసుకెళ్తానని అన్నారు.
నియోజకవర్గంలో కుటుంబ పాలనను అంతమొందించాలని 40 సంవత్సరాలుగా ఇక్కడ పాలనలో ఉన్న కుటుంబం నుండి ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి దూరం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు, దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, బాన్సువాడ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బోడి లక్ష్మన్ పాల్గొన్నారు.