నిజామాబాద్, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన ప్రభుత్వం మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో వృద్ధుల ఓటింగ్ శాతం పెరగడానికి తగిన సౌకర్యాలు కల్పించాలనీ, అందులో ముఖ్యంగా ఓటు వేసేటప్పుడు ప్రత్యేక లైను ఏర్పాటు చేయాలని, ఉచితంగా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలియజేస్తూ ముందుగానే సమాచారం ఇవ్వడం, 80 సంవత్సరాలు దాటిన, మరియు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో నడవలేని వారికి ఇంటి నుండే ఓటు వేసే సదుపాయాన్ని కలిగించటం లాంటి చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ సిటిజనులకు, రిటైర్డ్ ఉద్యోగులకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా కే. రామ్మోహన్రావును జిల్లా కలెక్టర్ అభినందిస్తూ శాలువతో సన్మానించి మెమొంటోను బహుకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, యాదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, డి.సి. ఓ.సింహాచలం, జిల్లా సంక్షేమ అధికారి, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.