నిజామాబాద్, ఆగష్టు 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుద్రూరు మండల కేంద్రంలో బుధవారం జరిగిన రూ. 25 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన వెంట నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు, బోదన్ ఆర్‌డివో రాజా గౌడ్, పోచారం సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు ఉన్నారు.
ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ… జీవితంలో ప్రతి మనిషికి కావలసినవి తోడు, నీడ అని, కోటీశ్వరుడు అయినా పేదవారు అయినా ఈ రెండు అవసరమన్నారు. ఆర్ధిక స్థోమత కలిగిన వారు పెళ్ళి చేయడం, ఇల్లు కట్టుకోవడం స్వంతంగా చేసుకోగలరని, పేదవారికి ఇవి కష్టమైన పనులని అన్నారు. అందుకే యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా లక్షా నూటపదహారు రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు పదివేల కోట్ల రూపాయలు అందాయని, బాన్సువాడ నియోజకవర్గంలో 14,000 మందికి 130 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చామని, గర్భవతి అయిన ఆడబిడ్డకు పౌష్టికాహారం అందించడానికి కోడిగుడ్డుతో అంగన్వాడీ కేంద్రాలలో కడుపు నిండా అన్నం పెడుతున్నారన్నారు. బలం కోసం న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని, బిడ్డ మూడవ సంవత్సరం నుండి చదువుకోవడానికి భోజనంతో అంగన్వాడీ కేంద్రాలు తరువాత గురుకులాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
శిశువులకు తల్లి పాలు శ్రేష్టమని, ముర్రుపాలు అమృతంతో సమానమని, బిడ్డకు తల్లి పాలు తాపించాలని, తల్లి పాల ప్రోత్సాహంలో బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి జాతీయ స్థాయి అవార్డు వచ్చిందన్నారు. అదేవిధంగా నీడ కోసం వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇంటి పథకాన్ని ప్రవేశ పెట్టారని, కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 రెండు పడకల గదుల ఇళ్ళు మంజూరు అయ్యాయని, ఇందులో 7000 ఇండ్లను లబ్ధిదారులు స్వంతంగా కట్టుకున్నారన్నారు.
రుద్రూరు మండల కేంద్రానికి 376 డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేశామని, ఇందులో 161 ఇళ్ళను లబ్ధిదారులు స్వంతంగా కట్టుకుంటున్నారని, గ్రామస్తులు అందరూ చర్చించుకుని స్వంత స్థలం, ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే కాంట్రాక్టర్ ద్వారా కట్టిస్తున్న ఇళ్ళను కెటాయించాలని సూచించారు. ఇంకా ఎవరైనా స్వంత ఇల్లు లేని పేదలు ఉంటే వారికి మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకంలో ఇంటిని మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ. 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో 41,500 మందికి పెన్షన్లు అందుతున్నాయని, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ రూ. 2016 ఇస్తున్నారన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర లో ఎనబై సంవత్సరాలు దాటితేనే పెన్షన్, అది కూడా వెయ్యి రూపాయలు మాత్రమే అన్నారు. చేతి వృత్తిపై ఆదారపడి బతుకుతున్న కులాలకు లక్ష రూపాయలు బిసి బందు ఇస్తున్నామని పేర్కొన్నారు.
నిజాంసాగర్ ఆయకట్టులో గతంలో లాగా ఇప్పుడు నీటి కొరత లేదని, దేవుని దయతో వానలు కురిసి ఏటా ప్రాజెక్టు నిండుతుందని, ముఖ్యమంత్రి సహకారంతో గోదావరి నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్నాయని, నియోజకవర్గంలో విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరిచాం, గ్రామగ్రామానికి రోడ్లు వేయించాను. గల్లి, గల్లికి సిసీ రోడ్లు నిర్మించామన్నారు. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నామన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో పేదలు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు చేసుకోవడానికి 100 జనరల్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నామని, ఇందులో రోజుకి కిరాయి కేవలం 5000 రూపాయలు మాత్రమేనని, ఈ కిరాయి డబ్బులను కరంటు బిల్లు, నీటి సరఫరా, వాచ్ మెన్, క్లీనింగ్ వంటి నిర్వాహనకు వాడుకుంటారని, ఇందులో వంట సామాను, టెంట్ సామాను కూడా ఉచితంగా అందుబాటులో ఉంటుందన్నారు. లక్ష రూపాయల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, వారం పది రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయన్నారు.
గత అయిదేళ్ళలో నియోజకవర్గంలో అడిగిన వారందరికీ అవసరమైన పనులను మంజూరు చేశామని, ఇప్పుడు మీరు నాకు బాకీ. అందరూ మంచి మనస్సుతో నన్ను ఆశీర్వదించాలన్నారు.