పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపకల్పన

నిజామాబాద్‌, ఆగష్టు 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో జరుగనున్నసాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపొందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇందుకు రాజకీయ పార్టీలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఓటర్ల డ్రాఫ్ట్‌ రోల్‌ వెలువరించిన నేపథ్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఆయా మండలాల తహశీల్దార్లతో కలెక్టర్‌ వేర్వేరుగా సమావేశమై కీలక సూచనలు చేశారు.

ఓటరు డ్రాఫ్ట్‌ రోల్‌ కు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21 నుండి సెప్టెంబర్‌ 19 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. అక్టోబర్‌ 04 న తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని సంబంధిత ఈ.ఆర్‌.ఓల దృష్టికి తేవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కొత్తగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు ఇంకనూ అవకాశం ఉన్నందున అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.

ఈ దిశగా ప్రజల సౌకర్యార్ధం సౌకర్యార్ధం జిల్లాలో ఈ నెల 26, 27 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నామని కలెక్టర్‌ వెల్లడిరచారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బూత్‌ లెవెల్‌ అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, ఇతర మార్పులు, చేర్పులకు సంబంధించిన నిర్ణీత నమూనా దరఖాస్తుఫారాలు వారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. వాటిని పూరించి బీ.ఎల్‌.ఓలకు అందజేయవచ్చని కలెక్టర్‌ సూచించారు. ఈ విషయమై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలన్నారు.

ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఓటర్లు ఎవరికివారు వ్యక్తిగతంగా వచ్చి దరఖాస్తులు అందజేయడం సముచితంగా ఉంటుందని సూచించారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటరు జాబితాలో పేర్ల తొలగింపును నిశితంగా పరిశీలించి ఎక్కడైనా పొరపాటు జరిగినట్లు గుర్తిస్తే, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. సమన్వయంతో జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్లేందుకు వీలుగా బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌ ల వివరాలను త్వరితగతిన అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.

జిల్లాలో ఇదివరకు 1509 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, కొత్తగా మరో 40 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలతో పాటు మరికొన్ని పోలింగ్‌ స్టేషన్ల పేర్లలో మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. కాగా, ఇదివరకు బీ.ఎల్‌.ఒలుగా కొనసాగిన వీ.ఆర్‌.ఏ లను ఇతర శాఖలలో సర్దుబాటు చేసిన దరిమిలా, ప్రత్యామ్నాయంగా వారి స్థానాల్లో నియమించబడిన నూతన బీ.ఎల్‌.ఓల వివరాలను రాజకీయ పార్టీలకు అందించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమీపించినందున ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అన్నారు.

ప్రస్తుతం ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపును ఖరారు చేసేముందు తప్పనిసరిగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. బీ.ఎల్‌.ఓలతో క్రమం తప్పకుండా కనీసం మూడు రోజులకు ఒక పర్యాయమైనా సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో వారు పకడ్బందీగా విధులు నిర్వర్తించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఎలాంటి తప్పిదాలు, గందరగోళానికి తావులేకుండా ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు చేర్పుల వివరాలను డేటా ఎంట్రీ చేయించాలన్నారు. ముఖ్యంగా జనాభా సంఖ్యను అనుసరిస్తూ కనీసం నాలుగు శాతం మంది 18 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఓటరు జాబితాలో పేరు కలిగి ఉండాలన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క యువ ఓటరు కూడా తప్పిపోకుండా ఓటరు జాబితాలో వారి పేర్లు చేర్పించాలన్నారు. జాబితా నుండి ఏదైనా పేరును తొలగించే ముందు క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, సహేతుకమైన కారణాలు ఉంటేనే తొలగించాలని కలెక్టర్‌ సూచించారు. దివ్యంగులైన ఓటర్లకు సంబంధించి జాబితాలో ప్రత్యేక మార్కింగ్‌ చేయించాలని, దీనివల్ల ఎన్నికల సంఘం కల్పిస్తున్న ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు వంటి పలు ప్రత్యేక సదుపాయాలను వారు సద్వినియోగం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని హితవు పలికారు.

అలాగే, ఈ నెల 26 వ తేదీ లోపు తమతమ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి, విద్యుత్‌, తాగునీరు, ర్యాంప్‌ లు, టాయిలెట్స్‌ వంటి వసతులు అందుబాటులో ఉన్నాయా లేవా అన్నది పరిశీలించి నివేదిక సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు.

సెక్టోరల్‌ అధికారులతో కలిసి రూట్‌ మ్యాప్లను పరిశీలించాలని, నిర్దిష్టమైన నిబంధనలను అనుసరిస్తూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తించాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »