ఆర్మూర్, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చంద్రయాన్ -3 విజయవంతంగా చందమామ దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన సందర్భంగా ఆర్మూర్ పట్టణములోని క్షత్రియ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీగా చంద్రయాన్ విజయోత్సవ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్షత్రియ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు దాదాపు 750 మీటర్ల జాతీయ జెండా చేత పట్టుకుని దేశభక్తి నినాదాలతో భారీగా చంద్రయాన్ విజయోత్సవ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ భారత దేశ జెండా చేతబూని ర్యాలీని ముందుండి నడిపించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి అంబేద్కర్‌కి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 విజయానికి అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. విక్రం లాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్ర సృష్టించిందన్నారు. కార్యక్రమంలో క్షత్రియ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, క్షత్రియ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి, కళాశాల అధ్యాపకులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.