నిజామాబాద్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ముఖ్యంగా డబుల్ ఎంట్రీ, బోగస్ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్.ఓ మొదలుకుని ఈ.ఆర్.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఈ.ఓ సమీక్ష జరిపారు. ఓటరు జాబితా పక్కాగా, పూర్తి పారదర్శకంగా రూపొందేలా అన్ని స్థాయిలలో పర్యవేక్షణ జరపాలని సూచించారు.
జాబితాలో రెండేసి పేర్లు కలిగిన ఉన్నవారిని గుర్తించినట్లయితే, అలాంటివారికి నోటీసులు జారీ చేయాలని అన్నారు. పక్షం రోజుల వరకు వివరణతో కూడిన సమాధానం రాకపోతే, క్షేత్ర స్థాయిలో సిబ్బందిని ఇంటికి పంపించి విచారణ జరిపించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డూప్లికేట్, అనుమానాస్పద పేర్లు జాబితాలో ఉండకూడదని, ఇలాంటి వాటి వల్ల ఎన్నికల సందర్భంగా గందరగోళ పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉంటుందన్నారు. ఇంకనూ అర్హులైన వారు మిగిలివుంటే ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సి.ఈ.ఓ సూచించారు.
పేర్ల నమోదు, మార్పులు-చేర్పుల కోసం పోలింగ్ బూత్‌ల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా 18 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన యువత తప్పనిసరిగా ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. ఈ మేరకు కళాశాలలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, అర్హులైన వారందరిచే నిర్ణీత ఫారం-6 దరఖాస్తు చేయించాలని అన్నారు. జనాభా లెక్కల వివరాలకు అనుగుణంగా పద్దెనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు సెప్టెంబర్ 19 లోపు ఓటరుగా తమ పేరును నమోదు చేసుకునేలా అన్ని చర్యలు చేపట్టాలని సి.ఈ.ఓ సూచించారు.
మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే సమయంలో నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించి మరణ ధ్రువీకరణ పత్రం వంటి ఆధారాలను సేకరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల, సహాయ ఎన్నికల అధికారులు కూడా స్వయంగా క్షేత్ర స్థాయిలో పోలింగ్ స్టేషన్లను సందర్శించి సదుపాయాలను పరిశీలించాలని, ఏవైనా లోటుపాట్లను గమనిస్తే వాటిని అధిగమించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెంటదివెంట ఓటరు గుర్తింపు కార్డు అందించేందుకు చొరవ చూపాలని, తమకు గుర్తింపు కార్డు అందాలేదంటూ ఏ ఒక్కరి నుండి సైతం ఫిర్యాదు రాకూడదని సూచించారు. పోస్టల్ శాఖ ద్వారా పంపిస్తున్న ఓటరు ఐ.డీ లు సకాలంలో, సంబంధిత ఓటర్లకు చేరుతున్నాయా? లేదా? అన్నది పర్యవేక్షణ జరపాలన్నారు. కాగా, ఏదైనా పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్యలో రెండు శాతానికి మించి పేర్లు తొలగింపు జరిగితే, ఈ.ఆర్.ఓలు తామే జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.
తుది ఓటరు జాబితా రూపకల్పనకు ముందే జాబితాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, నూటికినూరు శాతం జాబితా పక్కాగా ఉండాలని సి.ఈ.ఓ సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, చిత్రామిశ్రా, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ డీసీఓ సింహాచలం, ఈ.ఆర్.ఓలు, సహాయ ఈ.ఆర్.ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.