నిజామాబాద్, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతిని సంతరించుకుని వెలుగులీనుతున్నాయని శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న దుస్థితికి, ప్రస్తుతం స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమానికి గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు.
బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో రూ. 8.25 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కవిత సోమవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.ఆర్.సురేష్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
చౌట్పల్లి నుండి మెట్ల చిట్టాపూర్ (కరీంనగర్ సరిహద్దు) వరకు రూ. 7.48 కోట్లతో సింగిల్ లైన్ నుండి డబుల్ లైన్ బిటి రోడ్ ఏర్పాటు పనులకు, రూ. 21లక్షల అంచనా వ్యయంతో సొసైటీ గోదాం నిర్మాణానికి, రూ.6 లక్షలతో గ్రంథాలయం భవన నిర్మాణానికి, రూ. 50 లక్షలతో లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం ధ్వజస్తంభం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు హాజరైన ఎమ్మెల్సీ కవితతో పాటు రాజ్యసభ సభ్యుడు, మంత్రులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి, డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ బతుకమ్మలు, బోనాలతో స్వాగతించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కె.కవిత మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తూ, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో మారుమూల పల్లెలు సైతం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తున్నాయని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుండడంతో తెలంగాణలో సంపద గణనీయంగా వృద్ధి చెందుతోందన్నారు. తద్వారా దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్ సఫలీకృతం అవుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 300 కిలోమీటర్ల దిగువన గల కాళేశ్వరం జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్‌లోకి మళ్లించడం తమ ప్రభుత్వ పనితీరు, చిత్తశుద్ధి, అకింతభావంకు అద్దం పడుతుందన్నారు తెలంగాణ ప్రాంత బిడ్డగా ప్రజల కష్టసుఖాలు గుర్తెరిగిన నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉండడం వల్లే ఇంతటి అభివృద్ధి సాధ్యమవుతోందని స్పష్టం చేశారు.
స్వయాన రైతు అయిన కేసీఆర్, అన్నదాతకు ఆలంబనగా నిలువాలనే లక్ష్యంతో రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు సాగుచేసిన పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నూటికి నూరు శాతం నెరవేర్చడమే ముఖ్యమంత్రి నైజం అని అన్నారు. ప్రభుత్వ ఖాజానాపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలాంటి సీలింగ్ లేకుండా అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తున్నారని తెలిపారు.
ఒక్క చౌట్పల్లి గ్రామంలోనే గడిచిన 9 సంవత్సరాలలో ఆసరా పెన్షన్ల కింద 13 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ప్రజలకు మేలు చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగానే తెలంగాణ సంపద కూడా పెరుగుతోందని అన్నారు. గత ఎన్నికల సమయంలో బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీడీ కార్మికులకు పెన్షన్లు ప్రకటించారని గుర్తు చేశారు. మిగిలిపోయిన వారికి సైతం పెన్షన్ల కోసం సీ.ఎం దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, ఆసరా పెన్షన్ల పంపిణీతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు గౌరవం పెరిగిందన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా అన్ని వర్గాల వారి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధిని చూసి, పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రజలు సైతం ఇదే తరహా కార్యక్రమాలు అమలు చేయాలని, తమను తెలంగాణాలో కలపాలని కోరుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వానికి మద్దతుగా పల్లెలన్నీ ఏకగ్రీవ తీర్మానాలతో మద్దతు తెలుపుతున్నాయని హర్షం వెలిబుచ్చారు.
కాళేశ్వరం జలాల మల్లింపుతో శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతాంగానికి ఎంతో భరోసా ఏర్పడిరదని, వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటల సాగుకు ఇక బెంగ ఉండదని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పల్లెల ప్రగతీ ధ్యేయంగా ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తోందని తెలిపారు. సరిహద్దు, మారుమూల గ్రామమైన చౌటపల్లి లో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఒక్క గ్రామానికే అభివృద్ధి పనుల కోసం తొమ్మిదేళ్ల కాలంలో 46 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని వివరించారు.
ఇదే తరహాలో ప్రతి పల్లెలోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, ఇంటింటికి కుళాయిల ద్వారా శుద్ధి జలాలు, వాడవాడలా రోడ్ల నిర్మాణాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సాగు రంగానికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో వ్యవసాయ భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితిని, స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలువాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.