నోటరీ భూముల క్రమబద్ధీకరణను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ గురించి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారందరు వాటిని రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు.

తెలంగాణకు హరితహారం, బీ.సీలు, మైనార్టీలకు ఆర్ధిక సహాయం, దళిత బంధు, నోటరీ భూముల క్రమబద్దీకరణ, గొర్రెల పంపిణీ, గృహ లక్ష్మి, నివేశన స్థలాల అందజేత, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై సి.ఎస్‌ శాంతికుమారి సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ 84 ను అనుసరిస్తూ, 125 గజాల లోపు స్థలం కలిగి ఉన్న వారి నోటరీ ప్లాట్లను ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా రెగ్యులరైజెషన్‌ చేయడం జరుగుతోందన్నారు.

125 గజాలు దాటిన వాటికి ప్రస్తుత సబ్‌ రిజిస్ట్రార్‌ మార్కెట్‌ వ్యాల్యూ ప్రకారం స్టాంప్‌ డ్యూటీ, రూ. 5 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని సి.ఎస్‌ వివరించారు. ఈ విషయమై కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు స్పందిస్తూ, జిల్లాలోని నిజామాబాద్‌ నగరపాలక సంస్థ సహా అన్ని మున్సిపాలిటీల పరిధిలో విస్తృత ప్రచారం చేయిస్తున్నామని తెలిపారు. మీ-సేవ కేంద్రాల నిర్వాహకులకు కూడా నియమ, నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పించామన్నారు.

వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందించి లబ్ది చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. సెప్టెంబర్‌ 15లోగా జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని గడువు విధించారు. దశాబ్ది సంపద వనాల లక్ష్యాన్ని నూటికి నూరు శాతం సాధించాలని, నాటిన ప్రతి మొక్క సంరక్షించబడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో 47.90 లక్షల మొక్కలు నాటి హరితహారం లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేశామని సీ.ఎస్‌ దృష్టికి తెచ్చారు.

సంపద వనాల కోసం మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో ఎతైన మొక్కలు నాటేందుకు వీలుగా 13 బ్లాక్‌ లను గుర్తించామని, వాటిలో 12 బ్లాక్‌ లలో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోందని, మిగిలిన ఒక బ్లాక్‌లో కూడా మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, వృద్దాప్య, ఆసరా ఫించన్‌ దారులు మరణించిన పక్షంలో వారి భాగస్వామికి పెన్షన్‌ బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, క్షేత్రస్థాయిలో పెండిరగ్‌ ఉన్న ఆసరా ఫించన్‌ దరఖాస్తులను మూడు రోజుల్లో మంజూరు చేయాలని సీ.ఎస్‌ సూచించారు.

బీసి కులవృత్తుల కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం మొదటి దశలో మంజూరైన చెక్కుల పంపిణీ పూర్తయినందున, రెండవ దశ అమలుకు చర్యలు తీసుకోవాలని, రెండవ విడతలో ఆన్‌ లైన్‌ లో మాత్రమే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రెండవ విడత గొర్రెల పంపిణీని వేగవంతం చేస్తూ నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలన్నారు. గృహలక్ష్మి పథకం క్రింద ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్‌ పూర్తిచేసి అర్హుల జాబితాను అప్లోడ్‌ చేయాలని సీ.ఎస్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్‌ లు యాదిరెడ్డి, చిత్రామిశ్రా, నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »