కామారెడ్డి, ఆగష్టు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగవైకల్యంతో పుట్టిన పిల్లలలో ఆ భావం రానీయకుండా అందరు పిల్లల మాదిరిగా వారి ఎదుగుదలను ప్రోత్సహించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫెదర్ శోభ అన్నారు. దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు అందించుటకు బుధవారం స్థానిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో అలిమ్‌కో సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ జితేష్ వి పాటిల్, మునిసిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి కాలంలో పిల్లలను సంరక్షించడం ఏంతో కష్టమో అందరికి తెలుసునని, కాని అంగవైకల్యంతో పిల్లలు పుట్టినా బాధపడక అందరి పిల్లలతో సమానంగా పెంచుతున్న మాతృమూర్తులకు ధన్యవాదాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం కూడా సకలాంగులతో పాటు దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించుటకు అనేక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పిస్తుండడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు.
ఉచితంగా ఉపకరణాలు, ఆసరా పింఛన్లు, వివిధ వ్యాపారాలు, పరిశ్రమల స్థాపనకు ఆర్ధిక సహాయం అందజేస్తున్నదని అన్నారు. ఉపకరణాలు అందజేస్తున్న ఎలిమ్‌కో సంస్థ అవి ఎలా ఉపయోగించాలో అవగాహన కలిగిస్తున్నదని, ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ స్వతహాగా అంగవైకల్యం గల పిల్లలలో ఆత్మ విశ్వాసం, ధైర్యం, ఏదైనా సాధించాలనే సాధన శక్తి మెండుగా ఉంటుందని, తల్లిదండ్రులు కూడా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని అన్నారు.
వారు తలచుకుంటే చదువులో కానీ, క్రీడలలో మరేదేని రంగంలో అయినా రాణిస్తారని, కాకపొతే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలన్నారు. అందరి పిల్లలతో సమానంగా చూడాలన్నారు. జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బీబీపాటిల్ జిల్లాలోని వికలాంగులను గుర్తించి వారికి అవసరమైన ఉపకరణాలు అందజేయుటకు ఎంతో కృషి చేశారన్నారు. జైపూర్‌కు చెందిన ఎలిమ్‌కో సౌజన్యంతో బుధవారం 329 మంది దివ్యాంగులకు 116 వినికిడి యంత్రాలు, 89 వీల్ చైర్స్, 59 రోలేటర్స్, 16 బ్రెయిలీ కిట్స్, 117 మంది మానసిక వికలాంగులకు ఎంసీడ్ కిట్స్, 32 మందికి ఇతర పరికరాలను అందజేస్తున్నామని అన్నారు.
మునిసిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి మాట్లాడుతూ దివ్యాంగులకు సేవచేయడం ఎంతో ఉన్నతమైనదని అన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను ఎంతో ఓపిక, శ్రద్ధతో ఆలనపాలన చూస్తున్న తల్లిదండ్రులు ఎంతో గొప్పవాళ్ళని కొనియాడారు. అంతకుముందు దివ్యాంగులు ఆలపించిన పాటలు, నృత్యాలు అలరించాయి. అనంతరం అతిథులు దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, సమగ్ర శిక్ష అభియాన్ కో ఆర్డినేటర్ శ్రీపతి, కౌన్సిలర్, ఐ.ఆర్.ప్. లు, జిల్లా వికలాంగుల సంఘం ప్రతినిధి పోచవ్వ, అధికారులు పాల్గొన్నారు.