మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ భవిష్యత్తుకు కీలకమైన యువతను, విద్యార్థులను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి మాట్లాడుతూ, సమాజానికి పెను ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింత గట్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటుపడి వాటికి బానిసలుగా మారిన వారు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నష్టపోవడమే కాకుండా సమాజానికి కూడా ప్రమాదకారిగా తయారవుతారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై గట్టి నిఘా పెడుతూ, వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా అవగాహనా కలిపిస్తే, పిల్లలు మాదకద్రవ్యాలు సేవించడం వంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు, ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ, వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాలు వినియోగాన్ని నియంత్రించవచ్చని సూచించారు. ఈ దిశగా, పోలీస్‌, ఎక్సయిజ్‌, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్‌ హితవు పలికారు. అదనపు డీ.సీ.పీ జయరాం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్‌ శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.

అయినప్పటికీ జిల్లాలో మత్తు పదార్థాలు వినియోగం ఒకింత ఆందోళన కలిగించే స్థాయిలోనే కొనసాగుతోందని అన్నారు. గడిచిన దశాబ్ద కాలంలో జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణా, వినియోగానికి సంబంధించి 254 కేసులు నమోదయ్యాయని, అంతే సంఖ్యలో విక్రేతలు, రవాణాదారులు అరెస్ట్‌ చేయడం జరిగిందని వివరించారు. వీటిలో ఎక్కువగా జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ కేసులు ఉన్నాయని అన్నారు.

ఆంధ్ర ప్రాంతం నుండి గంజాయి ఎక్కువగా జిల్లాకు చేరుతున్నట్లు తెలుస్తోందని, ఈ మేరకు జిల్లా సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఎక్సయిజ్‌ తదితర శాఖలకు తమ పోలీసు శాఖ ద్వారా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని అన్నారు. సమావేశంలో నిజామాబాద్‌ ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శన్‌, డీ.ఈ.ఓ దుర్గాప్రసాద్‌, డీ.ఐ.ఈ.ఓ రఘురాజ్‌, వ్యవసాయ శాఖ అధికారి వాజిద్‌ హుస్సేన్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ రషీద్‌, అటవీ, రవాణా, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »