ఎన్నికల ఏర్పాట్లపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి

కామారెడ్డి, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఆయా నోడల్‌ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను వివిధ కార్యకలాపాలు నిర్వహించుటకు నియమించిన 16 మంది నోడల్‌ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌తో కలిసి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విధులు కేటాయించిన నోడల్‌ అధికారులు ఆయా అంశాలకు సంబంధించి పూర్తి అవగాహనా కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని చట్టం, రూల్స్‌ గురించి తెలుసుకోవాలని సూచించారు. తరచూ ఇసిఐ వెబ్‌ సైట్‌ సెర్చ్‌ చేస్తూ అప్‌డేట్స్‌ ను పరిశీలిస్తుండాలని అన్నారు. ఎన్నికల విధులు క్లిష్టమైనవని, ప్రతిరోజు ఒత్తిడి ఉంటుందని, మాకు తెలియదన్న విషయం ఉండరాదని స్పష్టం చేశారు.

అందరు బాధ్యతాయుతంగా కలిసికట్టుగా పనిచేయాలని, ఇది నాపనికాదని మరొకరిపై బాధ్యత మోపరాదని అన్నారు. సమయం తక్కువగా ఉన్నందున స్వీప్‌ కార్యకలాపాలు మరింత ముమ్మరం చేసి అక్టోబర్‌ 1, 2023 నాటికి 18 ఏళ్ళు నిండే యువత ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా పాఠశాల, కళాశాలలో ఎలక్టోరల్‌ లిటరసి క్యాంప్‌ లు నిర్వహించాలని సూచించారు. ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని, సెప్టెంబర్‌ 19 నాటికీ అర్హులైన యువతను ఓటరుగా నమోదు తో పాటు మార్పులు,చేర్పులు, తొలగింపులు పూర్తి చేసి తప్పులులేని ఓటరు జాబితా రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగు సిబ్బంది తో పాటు, ఇతర సిబ్బంది, బఫర్‌ సిబ్బంది ఏర్పాటుకు (మాన్‌ పవర్‌) పక్కాగా సమాచారం సేకరించాలని సిపిఓకు సూచించారు. కంప్యూటర్స్‌ సాఫ్ట్‌ వేర్‌, సిస్టమ్స్‌ బాగుండేలా చూసుకోవాలని, నెట్‌ ద్వారా గని మొబైల్‌ ద్వారా ఇచ్చే సమాచార వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. రూట్‌ మ్యాప్‌ ప్రకారం పోలింగ్‌ సిబ్బంది, ఎన్నికల పరిశీలకులు, సెక్టోరల్‌ అధికారులు వెళ్ళుటకు వాహనాలు సమకూర్చాలని జిల్లా రవాణాధికారికి సూచించారు.

అదేవిధంగా 80 ఏళ్ళు పై బడిన వృద్దులు ఇంటివద్ద నుండే బ్యాలట్‌ బాక్సులో ఓటు వేయించుకొనుటకు కూడా వాహనాలు సమకూర్చవలసి ఉంటుందని అన్నారు. ఎన్నికలలో అభ్యర్థులు ఖర్చు పెట్టె ప్రతి పైసాను మానిటరింగ్‌ చేయాలని ట్రెజరీ అధికారిని, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలను మానిటరింగ్‌ చేయాలని భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులు, డిపిఆర్‌ఓలకు కలెక్టర్‌ సూచించారు.

సమావేశంలో ఎన్నికల నోడల్‌ అధికారులు రాజారామ్‌, విజయ్‌ భాస్కర్‌, వాణి, ప్రవీణ్‌, శ్రీధర్‌ రెడ్డి, సింహరావు, నర్సయ్య, సతీష్‌ యాదవ్‌, శాంతికుమార్‌, రాజు, సురేంద్ర కుమార్‌, రఘునాథ్‌, ఎన్నికల పర్యవేక్షకులు అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »