టెట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15న నిర్వహించనున్న టెట్‌ – 2023 (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 15 న టెట్‌ పరీక్ష కొనసాగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుండి 12:00 గంటల వరకు మొదటి సెషన్‌ లో జరిగే పేపర్‌-1 పరీక్షకు జిల్లాలో 15,263 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా 64 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే, రెండవ సెషన్‌ లో మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే పేపర్‌-2 పరీక్షకు 11,573 హాజరు కానుండగా, 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ పట్టణాలతో పాటు డిచ్పల్లి, ఎడపల్లి లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినందున గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ ఆర్‌ఎం కు సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్‌ కో అధికారులను ఆదేశించారు.

నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరాలన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి ముందే అభ్యర్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి హితవు పలికారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్ష సజావుగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్‌ సెంటర్‌ లను మూసి వేయించాలని సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్ష జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. టెట్‌ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ : 9030282993 ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్‌.వి.దుర్గాప్రసాద్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »