ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం సర్వపూర్ గ్రామ సర్పంచ్ రాజేందర్, నేరల్ గ్రామ సర్పంచ్ సాయిలు, తిప్పారం గ్రామ సర్పంచ్ సాయిలు, లింగంపేట్ మండలం ఒంటర్పల్లి గ్రామ సర్పంచ్ రాజన్న, ఎల్లారం గ్రామ సర్పంచ్ మల్లయ్య, తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామ మాజీ సర్పంచ్ రాములు, బ్రాహ్మణపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సంగయ్య, రాజంపేట్ మండలం ఎల్లపూర్ తండా మాజీ సర్పంచ్ దీప్ల నాయక్, ఎల్లారెడ్డిపల్లి బీజేపీ నాయకులు, నాగిరెడ్డిపేట్ మండలం బంజారా తండా మాజీ సర్పంచ్ బన్సీ నాయక్, నాగిరెడ్డిపేట్ మండల బిఆర్‌ఎస్ నాయకులు, వివిధ గ్రామాల బీజేపీ, బీజేవైఎం, భారాస, నాయకులు, వార్డ్ మెంబెర్స్, యూత్ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
భారాస ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో, స్థానిక ఎమ్మెల్యే తన సొంత అభివృద్ది తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఎటువంటి శ్రద్ధ పెట్టలేదని, గ్రామ పంచాయతీలకు కనీస నిధులు కూడా మంజూరు చేయలేదని సర్పంచులు అన్నారు. మదన్ మోహన్ నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేస్తున్నారని, కరోనా సమయంలో అంబులెన్సులు పెట్టి, ఆక్సిజన్‌లు అందించి ఎందరినో రక్షించిన ఘనత మదన్ మోహన్‌దని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మదన్ మోహన్ సేవలను గుర్తు చేసారు.
ఈ సందర్బంగా మదన్ మోహన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలనుండి చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారు ఈ ఎమ్మెల్యే అని అన్నారు. మూడు సార్లు గెలిచి పాలించిన రవీందర్ రెడ్డి నియోజకవర్గాన్ని అట్టడుగు భాగానికి తోసేసారన్నారు. ఇద్దరు ఒకటే అని ఎవరు పాలించిన నియోజకవర్గానికి వాళ్ళు చేసిందేమి లేదన్నారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృధి పథంలో నడిపిస్తామన్నారు.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేది మదన్ మోహన్ అని స్పష్టం చేసారు. సురేందర్‌కి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.