కామారెడ్డి, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నర్సింలు (58) ప్రైవేట్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన క్లర్క్ కొండ శ్రీనివాస్ గౌడ్ మానవత దృక్పథంతో స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఎవరికైనా ఆపద వస్తే కుటుంబ సభ్యులే కాకుండా సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా స్పందించాలని అన్నారు.
2007లో రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసినప్పుడు కేవలం 70 మంది మాత్రమే దాతలు ముందుకు వచ్చారని నేడు 2000 పైగా రక్తదాతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం వివిధ రకాలైన ఆపరేషన్ల నిమిత్తమై తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం సకాలంలో రక్తాన్ని అందజేస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్నారని అన్నారు.
రక్తదానం చేసిన రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు. గడిచిన వారం రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 28 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది జీవన్, వెంకటేష్ పాల్గొన్నారు.