నిజామాబాద్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్ లెవెల్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. వారం రోజుల పాటు ప్రతి నివాస ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ, ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని అన్నారు.
ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు వీలుగా పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ శనివారం జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ బూత్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ తో కలిసి ప్రభుత్వ బాలుర ఐ.టీ.ఐలో గల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు. బీ.ఎల్.ఓ లు, ఎన్నికల అధికారులు అందుబాటులో ఉన్నారా ? అని ఆరా తీసిన కలెక్టర్, అన్ని నియోజకవర్గాల పరిధిలో హాజరును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని బీ.ఎల్.ఓలు, సూపర్వైజర్లకు సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో ఓటరు నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రత్యేక శిబిరాల సందర్భంగా ఎంతమంది పేర్లు నమోదు చేసుకున్నారు, వారిలో 18 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు, వారి వద్ద నుండి సేకరించిన ధ్రువీకరణ పత్రాలు తదితర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.
ఓటరు జాబితాలో పేర్లు తొలగించే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మృతి చెందిన వారి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యుల నుండి సేకరించి క్షుణ్ణంగా పరిశీలించాలని హితవు పలికారు. వివిధ కారణాల వల్ల ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు మారినట్లైతే, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ఓటర్లకు తెలియజేయాలని, తద్వారా వారు పోలింగ్ సమయంలో గందరగోళానికి గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోగల్గుతారని అన్నారు. కాగా, ప్రత్యేక శిబిరాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది ఉన్నారు.