నిజామాబాద్, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు సంబంధిత ప్రాంతంలోని ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు వీలుగా పోలింగ్ బూత్ ల పరిధిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ పోలింగ్ బూత్ లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆదివారం ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ తో కలిసి ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, బాల్కొండ మండలంలోని శ్రీరాంపూర్ గ్రామంలో గల యూపీఎస్ స్కూల్ లో గల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు. ఓటర్ల నమోదు, జాబితా నుండి పేర్ల తొలగింపు, మార్పులు-చేర్పుల కోసం పాటిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకుని, సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు.
ఓటరు జాబితాలోని ప్రతి ఓటరు వివరాలను ఇంటింటికి తిరుగుతూ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని బీ.ఎల్.ఓ లను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తిస్తూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే, వారందరినీ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి చేర్చాలని కలెక్టర్ సూచించారు.
ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన సందర్భంగా ఓటరు నమోదు, మార్పులు-చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా వెంటదివెంట బీ.ఎల్.ఓ యాప్ ద్వారా వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఓటరు తుది జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్, బాల్కొండ తహశీల్దార్లు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు ఉన్నారు.