కామారెడ్డి, సెప్టెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విజ్ఞప్తి చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వచ్చి చేరుతున్న 36,500 క్యూసెక్కుల నీటిని 5 ఫ్లడ్ గేట్ల ద్వారా (10,8,6,3,2 గేట్లు) 30 వేల క్యూసెక్‌ల నీటిని దిగువకు వదులుతున్నామని ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినదిగా వారు సూచించారు.
వాగులు దాటే ప్రయత్నం చేయరాదని అన్నారు. రోడ్లపై నీరు ప్రవహిస్తున్న బైకులు, ఫోర్ వీలర్ వాహనాలు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయరాదని, నీటి ఉధృతికి వాహనంతో పాటు మనిషి కొట్టుకుపోయే ప్రమాదముందని హెచ్చరించారు. సోమవారం గాంధారి మండలం మతుసంఘం గ్రామంలో ఒక పెద్ద మనిషి వాగు మధ్యలో చిక్కుపోతే అగ్నిమాపక, పోలీసు శాఖ, ప్రజాప్రతినిధుల సహకారంతో అతి కష్టం మీద రక్షించడం జరిగిందని గుర్తు చేశారు.
ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవహిస్తున్న వాగుల చెంతకు వెళ్లవద్దని హితవు చెప్పారు. నది దిగువ పరివాహక ప్రాంతం సమీపంలో ఉన్న పశువులను ఎత్తు ప్రదేశాలకు తరలించాలన్నారు. అదేవిధంగా నది పరివాహక లోతట్టు ప్రాంతాలకు చేపలు పట్టే వారు, పశువుల కాపరులు, రైతులు, ప్రజలు ఎవ్వరు వెళ్లవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.