రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా పంట రుణాలు అందించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నదాతకు ఆర్ధిక వెసులుబాటు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం రూ. లక్ష లోపు పంట రుణాల మాఫీ చేస్తోందని, రుణమాఫీ వర్తింపజేసిన రైతులకు సైతం తిరిగి కొత్తగా పంట రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు సూచించారు. సోమవారం సాయంత్రం దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి హరీశ్‌ రావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేస్తూ లబ్ది చేకూర్చనుందని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో మొదటగా లక్షా పది వేల రూపాయల లోపు పంట రుణాలు కలిగి ఉన్న వారికి రుణ మాఫీని వర్తింపజేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద 9654 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని వివరించారు.

బ్యాంకు అకౌంట్లు రద్దు చేసుకోవడం, వినియోగంలో లేకపోవడం వంటి కారణాల వల్ల లక్షా 60 వేల మంది వరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బు జమ కాలేకపోయిందన్నారు. అయినప్పటికీ సదరు రైతుల ఆధార్‌ నెంబర్‌ ను అనుసంధానం చేసుకుని పరిశీలన జరుపగా, 95845 మందికి రైతుబంధు ఖాతాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వారికి రుణమాఫీ డబ్బులు త్వరలోనే ఖాతాల్లో జమ చేయిస్తామని తెలిపారు.

మిగతా సుమారు 48 వేల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించాలని కలెక్టర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాధాన్యత క్రమంగా మొత్తం 42 లక్షల మంది రైతులకు ప్రభుత్వం లక్ష రూపాయల లోపు పంట రుణాల మాఫీని వర్తింపజేస్తుందని మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

కాగా రుణమాఫీ జరిగిన రైతులకు సైతం కొత్తగా పంట రుణాలను మంజూరు చేసేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో బ్యాంకర్లు సైతం కొత్త రుణాలు ఇచ్చేందుకు అంగీకరిస్తూ స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 18 లక్షల పైచిలుకు మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయగా, వారిలో కేవలం 6.54 లక్షల మందికి మాత్రమే కొత్త రుణాలు అందించారని అన్నారు.

రుణమాఫీ పొందిన రైతులందరికీ ఈ నెలాఖరు లోపు నూటికి నూరు శాతం కొత్త రుణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి ఆసరా పెన్షన్లు, కారుణ్య నియామకాలు తదితర కార్యక్రమాల ప్రగతిని జిల్లాల వారీగా సమీక్షించారు. ఆసరా పెన్షన్‌ పొందుతున్న లబ్ధిదారులు మృతి చెందినట్లైతే, వారి జీవిత భాగస్వామికి పెన్షన్‌ మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జీవిత భాగస్వామికి కొత్తగా మంజూరు చేసే ప్రొసీడిరగ్‌ పత్రాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎం.పీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల ద్వారా ఇప్పించేందుకు కృషి చేయాలని అన్నారు.

కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వేగవంతంగా నియామకాల ప్రక్రియను పూర్తి చేయడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను అభినందించారు. మొత్తం 1266 పోస్టులకు గాను 1095 నియామకాలు పూర్తి చేశారని, వివిధ కారణాల వల్ల అక్కడక్కడా పెండిరగ్లో ఉన్న మిగతా నియామకాలను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌, డీఆర్డీఓ చందర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »