కామారెడ్డి, సెప్టెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జన్మనిచ్చేది తల్లి, నడకనేర్పేది తండ్రి అయితే జీవితాన్ని ఇచ్చి నడిపేది గురువని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రేనివాస్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, విద్యార్థులు.పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు గురుపూజోత్వస శుభాకాంక్షలు తెలుపుతూ గురువు లేని విద్య గుడ్డిదని, స్థానం ఏదైనా అందరికీ మార్గదర్శకులు గురువులని అన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్ధులను తయారు చేసేది ఉపాద్యాయులని, అందుకే గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం కలిగిందని అన్నారు. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది ఉపాద్యాయులేనని, మేము కూడా ఒకనాడు విద్యార్థులమే, మాకు విద్య నేర్పిన గురువులు వలనే జ్ఞానం, విలువలు అబ్బినవని అన్నారు. ఈ రోజు మన దేశం చంద్రయాన్‌లో విజయవంతం కావడంలో పనిచేసిన సైంటిస్టులకు చిన్ననాడు విద్యబుద్దులు నేర్పింది కూడా ఉపాధ్యాయులేనని, మెరుగైన సమాజం ఉండాలంటే నాణ్యమైన విద్య ఉండాలని అన్నారు.
రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు కలిపి 26,000 ఉన్నాయి, ఇందులో సుమారు ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేది గురువులేనని అన్నారు. తరగతి గదిలోని విద్యార్థులు అందరినీ ఉపాధ్యాయుడు ఒకే విదంగా భావిస్తాడు.దానిని స్వీకరించే విదానాన్ని బట్టి విద్యార్థి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి హోదాలో నిజామాబాద్ వచ్చినప్పుడు మేమందరం స్కూల్ ఎగ్గొట్టి వారి సభకు వెళ్లి అద్భుతమైన ప్రసంగం విన్నామన్నారు. వారిని గౌరవించి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నది మన దేశంలోనే అని స్పీకర్ అన్నారు.
విద్య వచ్చిన వారికి సమాజంలో గౌరవం ఉంటుంది. ధనం ఉన్న వారికంటే విద్యావేత్తలకే గౌరవం ఉంటుంది. అలాంటి విద్యావేత్తలను తయారు చేసేది గురువులని, ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు రావడానికి ఉపాధ్యాయులు పగలు, రాత్రి కూడా కష్టపడుతున్నారని వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జీవితంలో మార్పుకు నాంది గురువులని, జ్ఞానమిచ్చిన గురువులను ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ప్రతి స్టేజిలో మన ఎదుగుదలకు ఒక గురువు తారసపడతారని వారిని మననం చేసుకోవాలన్నారు.
జుక్కల్ శాసనసభ్యలు హనుమంతు షిండే మాట్లాడుతూ తల్లి మొదటి గురువైతే ఉపాద్యాయుడు రెండవ గురువని అన్నారు. కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని, అందుకనుగుణంగా విద్యార్థులు తమ జీవితాలను మలచుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గురుకుల పాఠశాల నెలకొల్పి గుణాత్మకమైన విద్య నందిదేస్తున్నదని, డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు. మనలో ఉన్న సృజనాత్మకతను గురువులు గుర్తించి ప్రోత్సహిస్తారని, వారిని మరిచిపోరాదని అన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, ప్రశంసా పత్రంతో సభాపతి, కలెక్టర్, శాసనసభ్యులు సన్మానించారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో డీఈఓ రాజు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ లింగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.