విలువైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :
ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడిరపజేయాలని హితవు పలికారు.

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం సాయంత్రం జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్‌.వి.దుర్గాప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జెడ్పి చైర్మన్‌ విట్ఠల్‌ రావు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఆకుల లలిత, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గురుపూజోత్సవానికి శ్రీకారం చుట్టిన అనంతరం, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 30 మంది ఉపాధ్యాయులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు, జ్ఞాపికలను బహూకరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలతో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్ధ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారని అన్నారు. వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ప్రభుత్వ బడులలో చదివే పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే బృహత్‌ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మన ఊరు – మన బడి కార్యక్రమం కింద కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారని తెలిపారు.

ఇందులో భాగంగానే జిల్లాలోని సుమారు 150 వరకు ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్‌ తరగతి గదులు సమకూరాయని అన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులలో మెరుగైన విద్య, విజ్ఞానాన్ని పెంపొందిస్తూ సమసమాజ స్థాపనకు మూల కారకులుగా నిలువాలని కోరారు. గురువుల ఔన్నత్యం గురించి ఎంత పొగిడినా తక్కువేనని, సమాజ నడవడిక ఉపాధ్యాయుల పైనే ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు. దీనిని గుర్తెరిగి తమ గురుతర బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సూచించారు.

విద్యా బోధనతో పాటు విద్యార్థులలో నైతిక విలువలు, సద్గుణాలు పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా తన విద్యార్ధి దశలో ప్రేరణగా నిలిచిన గురువులు మోహన్‌ రెడ్డి, అనంత రాములు, గంగాధర్‌ గౌడ్‌ తదితర ఉపాధ్యాయుల కృషిని వివరిస్తూ, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గత స్మృతులను నెమరువేసుకున్నారు. ఆనాటి రోజుల్లో గ్రామీణ జీవన శైలి ఉపాధ్యాయులతో అల్లుకుపోయి ఉండేదని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులతో విడదీయరాని బంధం నెలకొని ఉండేదన్నారు. ప్రస్తుత తరుణంలోనూ అలాంటి పరిస్థితులు నెలకొల్పాలని, చక్కటి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు దిక్సూచిగా నిలువాలని పిలుపునిచ్చారు.

దేశంలోనే మరే ఇతర రాష్ట్రాల్లో లేనివిధంగా ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో జీతాలు చెల్లిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంకో అడుగు ముందుకేస్తూ, మరో పీ.ఆర్‌.సీ ని అందించబోతున్నారని, ఈ మేరకు త్వరలోనే పీఆర్సీ ప్రకటన చేస్తారని మంత్రి భరోసా కల్పించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయుల సమస్యల పైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లోనూ సానుకూల వైఖరితోనే ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 50వేల మందికి బదిలీలు జరుగానున్నాయని తెలిపారు.

జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరు ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నా, అందుకు గురువు అందించిన తోడ్పాటు, కృషియే కారణమని అన్నారు.అంకితభావం, నిబద్దతతో ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తే వారికి తగిన గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుందని, సమాజానికి ఉత్తమ పౌరులను అందించిన వారవుతారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, విద్యాబుద్ధులు, వినయ విధేయతలు నేర్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేసేది ఉపాధ్యాయులేనని కొనియాడారు.

అందుకే గురువులను దైవంతో సమానంగా భావిస్తారని అన్నారు. సామాన్య, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసి ఆదర్శప్రాయులుగా నిలువాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. అదే సమయంలో సామాజిక బాధ్యతలను సైతం గుర్తెరిగి తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »