నిజామాబాద్, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అతిథి గృహంలో నెలకొని ఉన్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ అబ్జర్వర్లు, ఇతర ఉన్నతాధికారులు ఎన్నికల పరిశీలన నిమిత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నందున అతిథి గృహంలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆర్ అండ్ బీ భవనం ఆధునికీకరణ కోసం ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రాధమికంగా రూపొందించిన ప్రతిపాదనలను కలెక్టర్ పరిశీలించి, పలు సూచనలు చేశారు. అవసరమైన సామాగ్రి, చేపట్టాల్సిన మరమ్మతులను గుర్తిస్తూ సమగ్రంగా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని, పనులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణలో సుమారు నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న నాలుగు సూట్లతో కూడిన భవన నిర్మాణం ప్రతిపాదనలు, స్థలాన్ని సైతం కలెక్టర్ పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆర్ అండ్ బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.