కామారెడ్డి, సెప్టెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రెండు సెషన్స్‌లో జరుగు రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్) (టెట్) సజావుగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి 24 కేంద్రాలకు నియమించిన వంద మంది చీఫ్ సూపెరింటెండెంట్లు, హాల్ సూపెరింటెండెంట్లు, శాఖాధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 15 న ఉదయం, మధ్యాన్నం రెండు సెషన్స్‌లో పరీక్ష నిర్వహింపబడుతుందని అన్నారు.
మొదటి సెషన్‌లో 5,535 మంది, రెండవ సెషన్స్‌లో 4,205 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయనున్నారని ఇందుకోసం జిల్లా కేంద్రంలో 24 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు పరీక్షలు సాఫీగా వ్రాయుటకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
టెట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించుటకు చీఫ్ సూపెరింటెండెంట్లు, హాల్ సూపెరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా డీఈఓ, పరీక్షల సహాయ సంచాలకులు నీలం లింగంలు వారికి పరీక్ష నిర్వహణపై అవగాహన కలిగించారు. అభ్యర్థులు ఏమైనా సందేహాలు, వివరాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెట్ సెల్ నెంబరు 7661854856 ను సంప్రదించవలసినదిగా డీఈఓ రాజు సూచించారు.