నిజామాబాద్, సెప్టెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
వినాయక్ నగర్‌లో గల ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్మన్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ, పెత్తందారి వ్యవస్థకు, దొరల పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు.
మహిళ అయి ఉండి కూడా తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటారని కొనియాడారు. దొరల ఆధీనంలో ఉన్న భూములను పేదలకు పంచి సమసమాజ స్థాపనకు కృషి చేసిన ధీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.