నిజామాబాద్, సెప్టెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాలకులకు అధికారంలో కొనసాగాలనే ధోరణి, కుహన లౌకిక వాదులు, కమ్యూనిస్టుల వల్ల తెలంగాణా స్వాతంత్రోద్యమ చరిత్రకి తీరని అన్యాయం జరిగిందని, అసలు చరిత్ర మరుగున పడిరదని, ఇప్పటికైనా పరిశోధనాత్మక ధృక్పథంలో వాస్తవ చరిత్రను వెలికితీస్తేనే ఆ చరిత్ర భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందని ప్రముఖ పాత్రికేయులు రాక సుధాకర్ అన్నారు.
హైదారాబాద్ సంస్థానం విముక్తి అమృతోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ ఆడిటోరియంలో ఇతిహాస సంకలన సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని వివిధ ప్రాంతాలలో జరిగన వాస్తవ సంఘటనలను ఆయవ వివరిస్తూ ఇటువంటి వీరుల పోరాటాలు కాలగర్భంలో కలిసిపోయే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు.
అందువల్లే ఒక ప్రముఖ రచయిత హైదరాబాద్ డిస్ట్రక్షన్ అనే పేరుతో పుస్తకం వెలువరించగా, ఉస్మానాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అధికారి హాయంలో అభివృధ్దిని వివరిస్తూ నిజాంను కీర్తిస్తూ పుస్తకాలను ప్రచురించారని అన్నారు. అటువంటి పుస్తకాలను ప్రముఖ వ్యక్తులు ఆవిష్కరించడం మరీ విడ్డూరమని అన్నారు. కొంత మంది పుస్తక రచయితలు ప్రస్తుత ప్రభుత్వంలో కూడ కీలక పదవులలో కొనసాగుతున్నారని అన్నారు. కాగా తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నిజాంను వ్యతిరేకించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య రాసిన పద్యాలతోపాటు మరో రచయిత రాసిన నిజాం రాజును కీర్తించే మరో పాఠం కూడా ఉంది, ఒకే పుస్తకంలో ఇంత వైవిధ్యం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
ఇక్కడి చరిత్రను తారుమారు చేయాలనే ప్రయత్నంలో భాంగంగా నిజాంరాజు గొప్పవాడనే పాఠాలు విద్యార్థుల పాఠ్యాంశాలలో చేరుతున్నాయని ఆయన అన్నారు. ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు వాస్తవ చరిత్రను వెలికి తీసి భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన రుక్మారెడ్డి పై ప్రచురించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఆంజనేయులు, ఇతిహాస సంకలన సమితి బాధ్యులు నరసింహం, దినేష్ రెడ్డి తదితరులు వేదికపై ఆసీనులైనారు. దినేష్ రెడ్డి తనతాతగారైన రుక్మారెడ్డి చరిత్రకు సంబంధించిన విశేషాలను వివరించారు. కందకుర్తి ఆనంద్ వందన సమర్పణ చేశారు.