15 వైద్య కళాశాల ప్రారంభం…విజయవంతం చేయాలని మంత్రి పిలుపు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 15 న వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విజయవంతం చేయవలసినదిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్టేట్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, యెల్లారెడ్డి, జుక్కల్‌ శాసనసభ్యులు జాజాల సురేందర్‌, హనుమంత్‌ షిండే, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ మహమ్మద్‌ ముజిబుద్దీన్‌, అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌లతో కలిసి అంతర్గత సమావేశం నిర్వహించారు.

అనంతరం పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సాయం అందించడంతో పాటు పేద విద్యార్థులు వైద్య విద్య నభ్యసించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. అందులో భాగంగా కామారెడ్డితో పాటు రాష్ట్రంలోని మరో 8 జిల్లాలలో వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్‌ రావు సమక్షంలో వర్చువల్‌ పద్ధతిన ప్రారంభించనున్నారని అన్నారు.

వచ్చే ఏడాది మరో 9 జిల్లాలలో వైద్య కళాశాలను ఏర్పాటు కానున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు తో పాటు 330 పడకల స్థాయి వైద్య కళాశాల ప్రారంభించుకుంటున్నందున ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు, ఆ తరువాత ఏర్పాటు చేసే పెద్ద ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరారు. సుమారు 15 నుండి 20 వేల మంది ప్రజలు ర్యాలీలో భాగస్వాములు అయి రాష్ట్ర ముఖ్యమంత్రికి కృజ్ఞతలు తెలపాలని మంత్రి పిలుపునిచ్చారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకొని ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా డాక్టర్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని అన్నారు. నూతన వైద్య కళాశాలలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు కాగా 15 శాతం ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఉంటుందని అన్నారు. నీట్‌లో లక్షకు పైగా రాంక్‌ వచ్చిన వైద్య కళాశాలలో సీటు ఖచ్చితంగా వస్తుందని అన్నారు. తెలంగాణా ఏర్పడక ముందు రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా నేడు 28 కి పెరిగాయని అంటే 5 రేట్లు అధికమయ్యాయని, డాక్టర్ల సీట్ల సంఖ్య కూడా 2850 నుండి 8515 కు పెరిగాయని అన్నారు.

ఎక్కడైనా ప్రైవేట్‌ యాజమాన్యంలో వైద్య కళాశాలలు పెరుగుతాయని కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు పెరిగాయని అన్నారు. ఇక ప్రతి సంవత్సరం 8,515 మంది డాక్టర్లు ఒక్క మన రాష్ట్రం నుండే ఉత్పత్తి అవుతారని అన్నారు. దేశ జనాభాలో రాష్ట్ర జనాభా 3 శాతం కాగా, రాబోయే రోజుల్లో మన రాష్ట్రం నుండి దేశానికి 40 శాతం మంది డాక్టర్లను అందించనున్నామని అన్నారు. అదేవిధంగా గతంలో 1183 పిజి సీట్లు ఉండగా నేడు 2,890 కి, సూపర్‌ స్పెషాలిటీలో 27 నుండి 179 సీట్లు పెరిగాయని, నిజంగా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పని మంత్రి చెప్పారు. అనంతరం 5 మంది మైనారిటీ లబ్దిదారులకు మంత్రి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »