బాన్సువాడ, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడి ఉద్యోగులు పూలమాలలు వేసి ర్యాలీగా సిడిపిఓ ఆఫీస్ ముట్టడి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ ఐసిడిఎస్ వ్యవస్థ 45 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కనీస వేతనాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, సెప్టెంబర్ 11 నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు డివిజన్లోని ఆయా మండల కేంద్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నామన్నారు.
ఆగస్టు 18న మంత్రి సత్యవతి రాథోడ్ ఇచ్చిన హామీలనే జీవోలో ఇవ్వడం జరిగిందని, ఇది పాత చింతకాయ పచ్చడిగా ఉందన్నారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000, ఉద్యోగ భద్రత ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించి, రిటైర్ అయిన అంగన్వాడి టీచర్ కు 10 లక్షలు ఆయాలకు ఐదు లక్షలు వర్తించేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఖలీల్, ప్రాజెక్టు అధ్యక్షులు మహాదేవి, శివగంగ రేణుక, సోనీ, విజయ, బాన్సువాడ, నిజాంసాగర్, నసురుల్లాబాద్, బీర్కుర్, మండలాల అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.