17న జాతీయ సమైక్యతా దినోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సమైక్యత దినోత్సవం కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. గురువారం కలెక్టరేట్‌ లోని సమావేశమందిరంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, ఆర్‌.డి.ఓ. శ్రీనివాస్‌ రెడ్డి లతో కలిసి జాతీయ సమైక్యత, ఓటరు నమోదు, వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఈ నెల 17 న కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర శాసనసభాపతి హాజరై పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారని అన్నారు. ఆ తరువాత ప్రజలనుద్దేశించి జిల్లాలో అమలవుచున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగిస్తారని కలెక్టర్‌ అన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖలు రుణాల పంపిణీకి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఓటరు నమోదును సమీక్షిస్తూ ఈ నెల 19 వరకు ఓటరు నమోదుకు అవకాశమున్నందున వివిధ శాఖల అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి తమ పరిధిలో వచ్చే సంఘాలు, పరిశ్రమలు, కళాశాలలు తదితర ప్రాంతాలలో అర్హులైన యువతను ఓటరుగా నమోదు చేసేలా చూడాలన్నారు. ఉన్నత పాఠశాల, కళాశాలలో మాక్‌ పోలింగ్‌పై అవగాహన కలిగించాలని, తద్వారా వారికి ఓటు విలువ, ఓటు వేసి విధానం తెలుస్తుందని అన్నారు. నైతిక ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగించాలన్నారు.

పెళ్లి చేసుకొని జిల్లాకు వచ్చిన మహిళలు ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. 2017-18, 2018-19 సంవత్సరాలలో పదవ తరగతి చదివిని విద్యార్థులు 24 వేల మంది ఉన్నారని, వారి వివరాలు సేకరించి అందరు ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. శుక్రవారం వర్చువల్‌ విధానం ద్వారా వైద్య కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు హాజరు కావాలన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై సమీక్షిస్తూ మత్తు పదార్థాల పట్ల ఎవరు బానిసలు కాకుండా చూడడంతో పాటు అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.

ఆబ్కారీ, పొలిసు, రవాణా, అటవీ, వ్యవసాయ,తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో మత్తుపదార్థాల విక్రయం, అక్రమంగా గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. అక్రమ మాదకద్రవ్యాల రవాణా, విక్రయంపై గట్టి నిఘా పెట్టాలని, ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే తమ దృష్టికి తెస్తే నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.

18-21 సంవత్సరాల యువత ఎక్కువగా మత్తుపదార్థాలకు బానిసలు అయ్యే అవకాశముంటుందని, వారిపై తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు దృష్టి పెట్టి వారి నడవడిక, ప్రవర్తనను గమనిస్తుండాలన్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే సైక్రియాటిస్టు ద్వారా తగు కౌన్సిలింగ్‌ ఇచ్చివారిలో పరివర్తన తేగలమన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాలలో వివిధ కార్యక్రమాలతో పాటు మత్తుపదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించుటకు కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓకు సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు రాజారామ్‌, దయానంద్‌, వాణి, రజిత, మల్లికార్జున్‌ బాబు, శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ. మసూద్‌ అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »