కామారెడ్డి, సెప్టెంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్, వైద్య కళాశాల ప్రధానాచార్యులు వెంకటేశ్వర్ లతో కలిసి దేవునిపల్లి లోని వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రవేశం పొందిన వంద మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైద్య కళాశాల అధ్యాపకులు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని వీక్షించుటకు వీలుగా లెక్చర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన స్క్రీన్, ఫర్నీచర్, సౌండ్ సిస్టంను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్కింగ్, కళాశాల ప్రాంగణంలో మిగిలిపోయిన పనులను ఈ సాయంత్రంలోగా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థిని, విద్యార్థులు ఎంతో సౌకర్యవంతంగా, సంతోషంగా చదువు కొనసాగించుటకు వీలుగా తరగతి గదులు, లెక్చర్ గ్యాలరీ, ల్యాబొరేటరీలు అన్ని హంగులతో సిద్ధం చేశామని, అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బందిని నియమించామని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు విడివిడిగా వసతి సౌకర్యం కల్పించామని కలెక్టర్ తెలిపారు.