కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ, వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్నిసృష్టిస్తూ దేశానికే దిక్సూచిగా తెలంగాణ వైద్య, ఆరోగ్యం నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు.
శుక్రవారం వర్చువల్ పద్ధతి ద్వారా ప్రగతి భవన్ నుండి ముఖ్యమంత్రి కామారెడ్డి, కరీంనగర్ ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం… జిల్లాల్లో ఒకేసారి 9 మెడికల్ కళాశాలలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం.. సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టమని అన్నారు. ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా ఈ కార్యక్రమం చాలా ఆత్మసంతృప్తి నిచ్చిందని అన్నారు.
పరిపాలన చేతకాదు అని ఎగతాళి చేసిన పరిస్థితుల నుండి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటు నేడు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. గతంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే, నేడు 26కు చేరాయని, వచ్చే విద్యా సంవత్సరానికి మరో 8 కాలేజీలు ప్రారంభించుకోబోతున్నామన్నారు. 2014లో 2850 మెడికల్ సీట్లు ఉంటే నేడు 8515 సీట్లకు పెరిగాయని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలో 85 శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకె అని అన్నారు.
రాబోయే రోజులలో ప్రతి సంవత్సరం ప్రయివేటు, ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నామని, ఇది దేశంలో 43 శాతమని అన్నారు. మనిషి రోగ నిరోధక శక్తి కలిగి ఆరోగ్యంగా ఉండాలంటే.. తెల్ల రక్త కణాలు ఏ విధంగా పని చేస్తాయో.. తెలంగాణ ఉత్పత్తి చేయబోయే తెల్లకోట్ డాక్టర్లు రాష్ట్రానికే కాదు.. దేశ ఆరోగ్య వ్యవస్థను కూడా కాపాడుతారని కేసీఆర్ అన్నారు. ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో.. అక్కడ తక్కువ మరణాలు, నష్టాలు సంభవిస్తాయని, ఆ స్పూర్తితో మెడికల్ కాలేజీలతో పాటు అద్భుతమైన ఆస్పత్రులను కూడా తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రం ఏర్పడే నాటికి 17 వేల పడకలు ఉంటే.. ఇప్పుడు 34 వేల పడకలకు చేరుకున్నామని, మరో 6 హాస్పిటల్స్ నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. వరంగల్‌లో అద్భుతమైన సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని, హైదరాబాద్‌కు నలువైపులా టిమ్స్ నిర్మిస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 50 వేలకు చేరుకోబోతోందని ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖను అభినందిస్తున్నాను అని కేసీఆర్ అన్నారు. కరోనా టైంలో ఆక్సిజన్ కొరతతో పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేడు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నామని అన్నారు.
ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోనేందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ 50 వేల పడకలను ఆక్సిజన్ బెడ్స్‌గా తీర్చిదిద్దుకుంటున్నామని వివరించారు. పారా మెడికల్ సిబ్బందికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా.. ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజీలు, పారా మెడికల్ కోర్సులు పెట్టుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కార్యక్రమంలో…వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ ఏ ఎం రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీ.సీ కరుణాకర్ రెడ్డి, టిఎస్ ఎం ఐ డీసీ ఎం.డీ, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గుమ్మడి కాయ కొట్టి కామారెడ్డి వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీకి ప్రవేశించారు. వారి వెంట ప్రభుత్వ విప్ గంప గోవెర్దన్, జిల్లా పరిషద్ చైర్ పర్సన్ డఫెదారి శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యులు హనుమంతు షిండే, జాజాల సురేందర్, మునిసిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్, వైద్య కళాశాల ప్రధానాచార్యులు వెంకటేశ్వర్ తదితరులు పాల్గొని దృశ్యమాధ్యం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చే వైద్య కళాశాలల ప్రారంభోత్సవం, ప్రసంగానికి తిలకించారు.
అనంతరం వైద్యకళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థిని,విద్యార్థుల జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వాగతం పలుకుతూ ఇక్కడ విద్య నభ్యసించుటకు చక్కటి వాతావరణం కల్పించామని అన్నారు. కామారెడ్డి జిల్లా శాంతికి, మతసామరస్యానికి ప్రతీక అని ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. వైద్య రంగంలో చాలా అవకాశాలుంటాయని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.