వేల్పూర్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ జైడి చిన్నవ్వ తెలిపారు. ఈ సందర్భంగా పది రోజులు పల్లె ప్రగతిలో చేసిప పనులను చదివి వినిపించారు.
అలాగే గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానించారు. పల్లె ప్రగతిలో ప్రతి కుటుంబానికి 6 మొక్కలను అందజేయడంతో పాటు మొక్కలు జాగ్రత్తగా సంరక్షించుకోవాలని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించడం జరిగిందన్నారు. రోడ్డు పక్కన చెట్లను ఎవరైనా ధ్వంసం చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పది రోజులు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ చురుకుగా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు అంగన్‌వాడి టీచర్లకు, ఆశా కార్యకర్తలకు, గ్రామ స్థాయి అధికారులకు గులాబీ మొక్కలతో సన్మానించారు. కార్యక్రమంలో పల్లెప్రగతి ప్రత్యేక మండల మహిళా సమైక్య అధికారి వెన్న మురళిరెడ్డి, ఎంపీటీసీ డొల్ల సత్యవాని, రాజేశ్వర్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ అరుణ్ కుమార్, గ్రామస్థాయి అధికారులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.