సరస్వతి నిలయాలు… తెలంగాణ గురుకులాలు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ధిక స్థోమత ఉన్నవారు తమ పిల్లలను కార్పోరేట్‌ స్కూళ్ళలో సీభాదివించుకుంటున్నారని, పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ గ్రామీణ మండలం కోనాపూర్‌-హన్మాజీపేట వద్ద నూతనంగా మంజూరైన ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను 12 కోట్లతో నిర్మించే భవనానికి, నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో రూ. 5 కోట్లతో నూతనంగా నిర్మించే అదనపు వసతి గృహ భవనానికి గిరిజన సంక్షేమం, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి శంకు స్థాపన చేశారు.

అంతకుముందు దుర్కిలో తాత్కాలికంగా ప్రైవేట్‌ భవనంలో ఏర్పాటు చేసిన గురుకుల బాలికల పాఠశాల-జూనియర్‌ కళాశాల తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, ఆర్‌డివో భుజంగరావు, స్థానిక, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, బంజారా నాయకులు, విద్యార్థులు, అధ్యాపకులు.తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ 2014 కు ముందు రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ, గిరిజనులకు సంబంధిచి 230 గురుకులాలు ఉంటే ఇప్పుడు 1008 గురుకులాలు ఏర్పాటు చేశామని, ఇందులో సుమారు 7 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు చదువుకుంటున్నారని, ఒక్కో విద్యార్థిపై లక్ష 25 వేల చొప్పున ఏటా రాష్ట్ర ప్రభుత్వం 9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని అన్నారు.

గతంలో రాష్ట్రంలో 2,850 మెడికల్‌ సీట్లు ఉంటే నేడు జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో 10,000 సీట్లకు పెరిగాయని, ఇందులో తెలంగాణా వాసులకే 85 శాతం సీట్లు కేటాయించబడ్డాయని, విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి మెడిసిన్‌, నర్సింగ్‌, ఇంజనీరింగ్‌ సీట్లు సాధించి తల్లిదండ్రుల కళలు సాకారం చేయాలన్నారు.ఈ సందర్భంగా గురుకుల పాఠశాల నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు. తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం లోపల భవన నిర్మాణం గావించి అందుబాటులోకి తెస్తామన్నారు.

ఒక్కో తరగతిలో 80 మంది విద్యార్థుల చొప్పున ప్రవేశం కల్పిస్తున్నామని, ఇందులో గిరిజనులకు 64 సీట్లు, ఎస్‌సిలకు 10, బిసి లకు 4, ఓసి లకు 2 చొప్పున సీట్లు ఉంటాయని అర్హులు ప్రవేశం పొందవలసినదిగా ఆయన సూచించారు. గురుకులాలలో చదువుతున్న విద్యార్ధులు ప్రభుత్వ పిల్లలని వారి భాద్యత మేము తీసుకుంటామని అన్నారు. తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని గతంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది, కానీ చేయలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజనుల కలను నిజం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో బంజారాలు మొదటి నుంచి నాతోనే ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నాం. సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో అత్యధికంగా లబ్ది పొందేది బంజారాలు. మొత్తం 14,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

వచ్చే జూన్‌ నాటికి ఈ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి వానాకాలం పంటల సాగుకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలో 11,000 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరైతే గిరిజనులకు 2,570 ఇళ్ళు ఇచ్చాను.ఇంకా అవసరమైన వారికి ఇస్తానని అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పెన్షన్లు ఇవ్వడం లేదు, రైతులకు పథకాలు ఇవ్వడం లేదు కానీ ఇక్కడ ఇస్తామని అంటున్నారు, విజ్ఞులైన ప్రజలు గమనించాలని సూచించారు.

గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. సామాన్యులకు విద్య చేరువ చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. గతంలో గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేవని, తెలంగాణా వచ్చాక అన్ని సౌకర్యాలు, హంగులతో గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న ఎస్టీ విద్యార్థులకు హాస్టళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా శాశ్వత భవనాలను నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.

సివిల్స్‌ పరీక్షలు రాయాలనుకునే ఎస్టీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి రెసిడెన్షియల్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌ ఏర్పాటుచేసిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో గిరిజన బాలబాలికలకు విడివిడిగా హాస్టల్‌ సౌకర్యం కల్పించేందుకు 140 కోట్లు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఎస్టీ విద్యార్థుల కోసం హాస్టళ్లు నిర్మించేందుకు 20 కోట్ల చొప్పున నిధులు అందజేస్తున్నారు. గిరిజనుల బిడ్డల జీవితాలను సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు విద్య ఒక్కటే సరైన మార్గమని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందని, ఆ దిశగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నదని అన్నారు.

గత ప్రభుత్వాలు వ్యవసాయానికి పగటి పూట 6 గంటల కరెంటు ఇవ్వలేదని, ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పాలనలో అర్ధరాత్రి కరెంటు ఇవ్వడంతో ఎంతో మంది రైతులు తెలు కాటు పాము కాటుతో ప్రాణాలు పోగట్టుకున్నారని అన్నారు. నేడు 24 గంటల ఉచిత కరెంటు, రైతు మద్దతు ధర, రైతు బంధు, రైతు బీమా అందిస్తున్నామన్నారు. దేశంలో 80శాతం ఉన్న రైతులను బీజేపీ, కాంగ్రెస్‌ ఏనాడు పట్టించుకోలేదు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయగలరా అని ప్రశ్నించారు. మార్గమధ్యంలో వెంకటాపూర్‌ సేవాలాల్‌ మందిరంలో సభాపతి, మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »