భిక్కనూరు, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం, దక్షిణ ప్రాంగణం యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను బే షరతుగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 16వ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలో వినాయక స్వామి పూజ చేసి కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యను విన్నవించుకున్నారు.
వీరితోపాటు వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు సైతం పూజలు చేసి తమ ఉపాధ్యాయులు రెగ్యులరైజ్ కావాలని వీరి కోరిక నెరవేరాలని, తమ జీవితాలలో వెలుగులు నేర్పుతున్న అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసి వారి జీవితాలలో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలను, రాష్ట్ర ఉన్నత విద్య శాఖ అధికారులు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని తమ డిమాండ్ నెరవేరాలని, వినాయకుడి ద్వారా తమ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే తాము అన్ని విధాల అర్హతలు ఉండి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి పాటుపడుతున్నామని, ఉన్నత విద్యను మరింత చేరువ కావడానికి తమను రెగ్యులరైజ్ చేసి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సునీత, నిరంజన్ శర్మ, రమాదేవి, వైశాలి, సరిత, శ్రీమాతా నరసయ్య, దిలీప్, కనకయ్య పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.